
- ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పెంపుపై నిర్ణయం తీసుకోలే
- మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: ఏప్రిల్ మొదటి వారంలో భూ భారతి చట్టం రూల్స్ విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో మార్కెట్ వ్యాల్యూను కూడా సవరించనున్నట్లు పేర్కొన్నారు. గతంలో తీసుకున్న సాదా బైనామా అప్లికేషన్లనే పరిష్కరిస్తామని.. కొత్తగా సాదా బైనామాలు తీసుకోమన్నారు. ఎల్ఆర్ఎస్కు సంబంధించి వేగం పుంజుకున్నదని.. 25 శాతం రాయితీ ఈ నెలాఖరుతో ముగుస్తుందని చెప్పారు. ఈ రాయితీకి సంబంధించి గడువును మరింత పొడిగించే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎల్ ఆర్ ఎస్ పేమెంట్ అయ్యాక సింగల్ కేసు కూడా మిస్ కాదని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎల్ ఆర్ ఎస్ క్రమబద్దీకరణకు ధ్రువీకరణ పత్రం ఇస్తుందని పేర్కొన్నారు.
‘‘గజ్వేల్ ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం కేసీఆర్ అక్కడే చుట్టూకోట కట్టుకుని ఉన్నారు. కానీ, ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఆయన ఉండాలి కదా?” అని ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులపైనా కూడా భూ భారతి చట్టం అమల్లోకి వచ్చాక నిర్ణయం తీసుకుంటామన్నారు. గ్రామ పాలన ఆఫీసర్ (జీపీవో) పాత వీఆర్వో, వీఆర్ఏలను తీసుకుంటున్నామని.. వారికి ఇంటర్ విద్యార్హతను తీసుకుంటున్నట్లు వివరించారు. ఇందుకోసం తెలుగులోనే ఎగ్జామ్ నిర్వహిస్తామన్నారు. పది వేల పోస్టుల్లో దాదాపు ఆరు వేల మందికి పరీక్ష నిర్వహించే చాన్స్ ఉందని తెలిపారు. మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరుగుతుందని, అయితే ఎవరికి అవకాశం ఉంటుందో మాత్రం తనకు తెలియదని ఆయన అన్నారు. కాగా, ఇందిరమ్మ ఇండ్ల పేర్ల మార్పు ఏమీ ఉండదని చెప్పారు. కేంద్రం నిధులు కేటాయించకపోయినా, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కొనసాగుతుందన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో తనకు ఎలాంటి గ్యాప్ లేదని మంత్రి తెలిపారు.తనకు అభిమన్యురెడ్డి ఎవరో తెలియదన్నారు. తనకు డెయిలీ వంద మంది రెప్రజెంటేషన్లు ఇస్తుంటారని, అందులో జెన్యూన్ గా ఉన్న వాటినే పరిష్కరిస్తామని తెలిపారు. మిగతా వాటిని ఏ పార్టీలో ఉన్నా.. కావని సూటిగా చెప్పేస్తామన్నారు.
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ల్లో స్లాట్ మెథడ్
త్వరలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో స్లాట్ మెథడ్ లో రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక సాప్ట్ వేర్ ను కూడా రెడీ చేశామన్నారు. తొలుత ప్రైమ్ ఏరియాల్లో ఫైలట్ ప్రాజెక్టుగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 10 నుంచి 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. తొలుత ఉగాదికి ప్రారంభించాలని ప్రభుత్వం భావించినా, సన్నబియ్యం కార్యక్రమం ఉన్నందున ఆ తర్వాత లాంచింగ్ కు రెవెన్యూ శాఖ సిద్ధమైనట్లు వివరించారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్న ఈ నూతన విధానంతో కేవలం 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు.