నువ్వేదో పొడుస్తావని జనం గెలిపించలే.. పాలేరు ఎమ్మెల్యేపై పొంగులేటి శ్రీనివాస్​ఫైర్

నేలకొండపల్లి, వెలుగు: పాలేరు కాంగ్రెస్​అభ్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం నేలకొండపల్లిలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని చెప్పారు. ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి డబ్బు ఉందనే మదంతో విర్రవీగుతున్నాడని మండిపడ్డారు.

 నువ్వేదో పొడుస్తామని పాలేరు ప్రజలు గెలిపించలేదని గుర్తుంచుకోవాలన్నారు. గత ఎన్నికల్లో ఎన్ని డబ్బుల సంచులు తెస్తే పాలేరు ప్రజలు గెలిపించారో గుర్తుకుతెచ్చుకోవాలన్నారు. కాంగ్రెస్​కార్యకర్తల కష్టంతో గెలిచిన సంగతి మర్చిపోవద్దన్నారు. ఎన్నికల కోడ్​రాగానే బీఆర్ఎస్​లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలంతా తిరిగి సొంత గూటికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. అసలు ఆట ఇప్పుడే మొదలైందని, గెలుపు కోసం ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు.

నిలదీస్తే దాడి చేస్తారా?

ఖమ్మం: వైఎస్సార్ కాలనీలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించలేదని పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆరోపించారు. కొంతమంది తమ పేర్లను మాయం చేశారని ఆరోపిస్తూ మహిళలు, యువకులు, స్థానికులు, స్థానిక కార్పొరేటర్ తో కలిసి మంత్రి అజయ్ ని నిలదిస్తే, ఆయన అనుచరులు, పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. పోలీసులు గులాబీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మంగళవారం ప్రకటనలో మండిపడ్డారు. వివరణ ఇవ్వాల్సింది పోయి దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు.