చీమలపాడు ఘటన.. మృతుల కుటుంబాలకు పొంగులేటి ఆర్థిక సాయం

ఖమ్మం జిల్లా చీమలపాడులో ఇటీవల సిలిండర్ ప్రమాదంలో మృతి చెందిన  వారి  కుటుంబాలను ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.  -- ఒక్కొక్క కుటుంబానికి రూ. 50వేల రూపాయలను ఆర్థిక సాయంగా అందించారు.  అన్నగా అండగా ఉంటానని మృతుల కుటుంబాలకు ఆయన హామీ ఇచ్చారు.  

అధికార పార్టీ సమక్షంలో జరిగిన ఘటన కాబట్టి  దీనిని అధికార పార్టీ చేసిన మర్డర్లేనని  పొంగులేటి ఆరోపించారు.   ఆత్మీయ సమావేశం నిర్వహించిన  జిల్లా అధ్యక్షుడు తాత మధు , వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ , జిల్లా ఎంపీ నామా నాగేశ్వర్ రావుల పై  ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపించాలని పొంగులేటి డిమాండ్ చేశారు.  పోలీసులు కేసు నమోదు చేసే వరకు తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. 

ఏప్రిల్‌ 12న  చీమలపాడులోని ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.  ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్న సభా ప్రాంగణానికి కొద్ది దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు.  

మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని, అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు.  రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.