- ఈడ మొత్తం కొల్లగొట్టారు.. ఇప్పుడు మహారాష్ట్ర మీద పడ్డరు : పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- ఇకనైనా పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్
- మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- కొత్తగూడెంలో ‘పోడు భరోసా’ ర్యాలీ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తెలంగాణను కొల్లగొట్టింది చాలక ఇప్పుడు మహారాష్ట్రను దోచుకునేందుకు కల్వకుంట్ల కుటుంబం ప్లాన్ చేస్తున్నదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికలప్పుడే సీఎం కేసీఆర్ కు సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయన్నారు. హామీలు ఇచ్చి మరిచిపోవడం సీఎంకు అలవాటైందని విమర్శించారు. కొత్తగూడెంలోని కొత్తగూడెం–ఇల్లెందు క్రాస్ రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు శనివారం మండు టెండలో పోడు సాగుదారులతో కలిసి పొంగులేటి ‘పోడు భరోసా’ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. 2014, 2018 ఎన్నికల టైమ్ లో పోడు భూములకు పట్టాలిస్తానని కేసీఆర్ హమీ ఇచ్చారని, తొమ్మిదేండ్లయినా ఒక్క పట్టా కూడా ఇయ్యలేదని మండిపడ్డారు.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పోడు రైతుల వద్దకే వెళ్లి కుర్చీ వేసుకొని కూసొని పోడు భూములకు పట్టాలిస్తానని చెప్పిన కేసీఆర్ మాటలకు నాలుగున్నరేండ్లైనా అతీగతీ లేదని, మాయ మాటలతో గిరిజనులను ఎన్ని సార్లు మోసం చేస్తారని ప్రశ్నించారు. నాలుగైదు నెలల్లో ఎన్నికలు వస్తాయనే ఆలోచనతో పోడు భూములకు పట్టాలిస్తానని మరోసారి గిరిజనులను మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడన్నారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి అర్హులైన పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలన్నారు. తాతల కాలం నుంచి పోడుసాగు చేసుకుంటున్న గిరిజన, గిరిజనేతరులందరికీ పట్టాలు ఇవ్వాలని, వారిపై మోపిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ర్యాలీలో ఉద్రిక్తత
జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, నాయకులు తెల్లం వెంకట్రావ్, జారే ఆదినారాయణలతో పాటు వేలాది మంది పోడు సాగుదారులతో పొంగులేటి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ కొంత ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టరేట్లో వినతిపత్రాన్ని ఇచ్చేందుకు ర్యాలీగా వెళ్తున్న వారిని అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేస్తుండగా నాయకులు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు, నాయకులకు వాగ్వాదం జరిగింది. బారికేడ్లను దాటుకుంటూ కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు పెద్ద ఎత్తున పోడు సాగుదారులు వస్తుండడంతో పోలీసులు కలెక్టరేట్ గేట్లు బంద్ చేశారు. అనంతరం పొంగులేటి ఆధ్వర్యంలో నాయకులు అదనపు కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు.