వైన్స్ షాపు టెండర్లకు 15 రోజుల గడువు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం...గృహలక్ష్మీ పథకం అప్లికేషన్లకు మాత్రం మూడు రోజులే గడువు ఎందుకు ఇచ్చారని మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వినర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లను దోచుకుందని ఆరోపించారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే..రైతు రుణమాఫీ మొదలు పెట్టారని దుయ్యబట్టారు. మానుకోట అంటే ఓ చరిత్ర ఉన్న ప్రాంతమని.....కేసీఆర్ గతాన్ని మరచిపోయి సోనియా రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
సొంత స్థలం ఉంటే రూ. 5 లక్షలు ఇస్తామని..రూ. 3 లక్షలకే కుదించి పేదలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు తోడు దొంగల పార్టీ అన్నారు. పథకాల పేరుతో మరోసారి మోసం చేసి మూడోసారి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని..కేసీఆర్ ను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఫాం హౌజ్ కే పరిమితం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందుకే తాను కాంగ్రెస్ లో చేరానని..కేసీఆర్ ను ఇంటికి పంపేవరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులైన అందరికి పోడు భూములకు పట్టాలిస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హులకు ఇండ్ల నిర్మాణానికి 5 లకలు ఇస్తామన్నారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని..రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని చెప్పారు.