ఖమ్మం కాంగ్రెస్​లో పొంగులేటి అలజడి..చేరిక ఖాయం కావడంతో ఆశావాహుల్లో టెన్షన్

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం, వెలుగు :  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కాంగ్రెస్​లో చేరిక ఖాయం కావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆ పార్టీ ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. పొంగులేటి తమ అనుచరుల కోసం కొన్ని సీట్లు అడిగారని, దానిపై అంగీకారం కుదిరాకే కాంగ్రెస్​లో చేరుతున్నారనే చర్చ జరుగుతోంది. దీంతో ఎక్కడ తమ స్థానాలకు ఎసరు వస్తుందోనని కాంగ్రెస్​నేతలు ఆందోళన చెందుతున్నారు. పైకి సర్వే ప్రకారమే టికెట్లు ఉంటాయని అటు కాంగ్రెస్​హైకమాండ్, ఇటు పొంగులేటి చెప్తున్నా ఆ పరిస్థితి ఉండకపోవచ్చని ఆశావాహులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొందరు అభ్యర్థులను పొంగులేటి బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. టికెట్​వస్తుందనే ఆశతోనే ఇన్నేండ్లుగా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కష్టపడ్తున్నామని, తీరా ఇప్పుడు ఇతర పార్టీల్లోంచి వచ్చినవారికి టికెట్ ఇస్తే తమ పరిస్థితి ఏమిటని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. కొందరు తమ గాడ్​ఫాదర్లుగా భావించే భట్టి, రేణుకాచౌదరి తదితర లీడర్లను కలిసి సీట్లపై హామీ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. 

కొత్తగూడెంలో పెద్ద సంఖ్యలో ఆశావహులు

కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఆ పార్టీలో టికెట్ ఆశిస్తున్న పలువురు ఆశావాహులు రెండు, మూడేండ్లుగా తమ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్​తో టచ్​లో ఉంటున్నారు. ఎన్నికల బరిలో తామే ఉన్నామని హైకమాండ్​కు సంకేతాలు పంపుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, మాజీ కేంద్ర మంత్రులు రేణుకా చౌదరి, బలరాం నాయక్​తో పాటు రాష్ట్రంలోని ముఖ్య నేతలతో కొందరు ఆశావాహులు టచ్​లో ఉండి టికెట్​పై ఆశలు పెంచుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో ఆశావాహుల సంఖ్య భారీగానే ఉంది. ఇక్కడ చీమల వెంకటేశ్వర్లు, డాక్టర్ రవి, రాంచంద్రనాయక్, మంగీలాల్ నాయక్, లక్ష్మణ్ నాయక్, వెంకటేశ్వర్లు, మోకాళ్ల శ్రీనివాస్​తో పాటు బెల్లయ్య నాయక్, సంజీవ్ నాయక్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కొడుకు టికెట్ రేసులో ఉన్నారు. 

అశ్వారావుపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రధానంగా టికెట్ రేసులో ఉన్నారు. ఆయనతో పాటు జడ్పీటీసీ సున్నం నాగమణి, ఒగ్గెల పూజ, ధంజు నాయక్ టికెట్ ఆశిస్తూ పావులు కదుపుతున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుతోపాటు ఎడవల్లి కృష్ణ, నాగ సీతారాములు ప్రధానంగా టికెట్ రేసులో ఉన్నారు. వీరితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు టికెట్ కోసం యత్నిస్తున్నారు. పినపాక నియోజకవర్గంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కొడుకు సూర్యతోపాటు పోలేబోయిన శ్రీవాణి, కాటిబోయిన నాగేశ్వరరావు, కొమరం లక్ష్మణ్​రావు ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నారు. 

ఖమ్మంలోనూ లిస్ట్​పెద్దదే.. 

ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఖమ్మం నియోజకవర్గంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు జావెద్ కొన్నేళ్లుగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకో ఒకరిద్దరు కూడా టికెట్ పై ఆశలు పెట్టుకున్నా, వాళ్లు బలమైన అభ్యర్థులు కాదనే చర్చ జరుగుతోంది. పాలేరులో రాయల నాగేశ్వరరావు టికెట్​పై ఆశతో ఉన్నారు. రెండేళ్ల క్రితం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి రూ.4,5 కోట్లు ఖర్చుచేసి ఓడిపోయారు. తర్వాత కూడా పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రేణుక వర్గం తరఫున మద్ది శ్రీనివాస్ రెడ్డి, మాధవిరెడ్డి రేసులో ఉన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, కోటూరి మానవతారాయ్ కొన్నేళ్లుగా పార్టీ భారాన్ని మోస్తున్నారు. 

ALSO READ :అధికారంలోకి వచ్చిన..తొలి ఏడాదిలోనే 2 లక్షల కొలువులు : భట్టి విక్రమార్క

రేణుకా వర్గం నుంచి ఇటీవల పార్టీలో చేరిన మట్టా దయానంద్ టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. కొండూరి సుధాకర్ ను పొంగులేటి తన అభ్యర్థిగా చెబుతున్నారు. వైరాలో రేణుకావర్గం నుంచి ధరావత్ రామ్మూర్తి నాయక్ , భట్టి వర్గం నుంచి రాందాస్ నాయక్, బాలాజీ నాయక్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ విజయాబాయిని అభ్యర్థిగా పొంగులేటి ప్రకటించారు. మధిరలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సిట్టింగ్ సీటు కాగా, పొంగులేటి టీమ్ లో డాక్టర్ కోట రాంబాబు టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో చాలా మంది కొన్నేండ్లుగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. వీరందరిపై ఇప్పుడు పొంగులేటి పిడుగు పడింది.