ఎన్నికల పోలింగ్, ఫలితాలపై రేవంత్ నివాసంలో కాంగ్రెస్ నేతల చర్చలు

ఎన్నికల పోలింగ్,  ఫలితాలపై రేవంత్ నివాసంలో కాంగ్రెస్ నేతల చర్చలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి క్యూ కడుతున్నారు. 2023, నవంబర్ 30వ తేదీ గురువారం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి.  ఈ క్రమంలో   2023, డిసెంబర్ 1వ తేదీ శుక్రవారం ఉదయం కాంగ్రెస్ నేతలు పొంగిలేటి శ్రీనివాస రెడ్డి, చంద్రశేఖర్, మల్ రెడ్డి రంగారెడ్డి, బండి రమేష్ తోపాటు పలువరు నాయకులు హైదరాబాద్ లోని రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకుని ఆయనను కలిశారు.   తమ నియోజకవర్గాల్లోని పరిస్థితులు, ఫలితాలపై రేవంత్ తో వీరు చర్చించినట్లు సమాచారం. ఫలితాల తర్వాత అభ్యర్థులను క్యాంపుకు తరలించడంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది నాయకులు సాయంత్రం రేవంత్ నివాసానికి వెళ్లి కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పోలింగ్ తక్కువ జరిగిన స్థానాలపై ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆరా తీసున్నారు. పోలింగ్ ఎందుకు తగ్గిందనే దానిపై విశ్లేషిస్తున్నారు.  పోలింగ్ శాతం గెలుపు ఓటములపై ఎలా ఉంటుందని చర్చిస్తున్నట్లు సమాచారం.మరోవైపు,  మెజార్టీ సీట్లతోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో మెజార్టీ సర్వే సంస్థలు.. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నట్లు వెల్లడించాయి.