- ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో ఎలాంటి పొరపాట్లు జరగొద్దు
- రేపు పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం
- ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి
- అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి పెంపు కోసం ప్రతిపాదనలు
- సన్న, దొడ్డు రకాల వడ్ల కొనుగోళ్లకు వేరువేరుగా సెంటర్లు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే రిపేర్లు చేపట్టాలని సూచన
హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వం గొప్పగా ఆర్భాటంగా ప్రకటించి అరకొరగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించిందని, ఇందులో కొన్ని మాత్రమే పూర్తయ్యాయని, ఈ పూర్తయిన ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి దసరా లోపు అప్పగించాలని కలెక్టర్లకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం జిల్లా ఇన్-చార్జ్ మంత్రి చైర్మన్ గా, జిల్లా కలెక్టర్ కన్వీనర్ గా, మరికొంతమంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించి, యూనిక్ నంబర్ తో స్మార్ట్ కార్డు ఇవ్వడమే ఫ్యామిలీ కార్డు ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
ఈ నెల 3న ఈ పైలెట్ ప్రాజెక్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ కార్డులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, వాస్తవానికి దగ్గరగా జాగ్రత్తగా కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (యూడీఏ), ఎల్‌ఆర్‌ఎస్, డబుల్ బెడ్రూం ఇండ్లు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై మంగళవారం సెక్రటేరియెట్ నుంచి జిల్లా కలెక్టర్లతో మంత్రి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లోని 238 ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే ఈ ప్రాంతాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ నెల 3 నుంచి 7 వరకు క్షేత్ర స్థాయిలో (డోర్ - టు -డోర్) వివరాలను పకడ్బందీగా సేకరించాలని అధికారులకు సూచించారు. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు గాను ప్రతి నియోజకవర్గానికి ఆర్డీవో స్థాయి, జోనల్ కమిషనర్ స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే మండలానికి ఒక తహశీల్దార్‌ను కూడా నియమిస్తున్నట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల వివరాల నమోదు, మార్పులు చేర్పుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఎల్ఆర్ఎస్లో వేగం పెంచాలి
నాలుగేండ్ల నుంచి లక్షలాది మంది ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఎదురు చూస్తున్నారని, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధ ప్రతిపాదికన దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో జరగడం లేదని, కొన్ని జిల్లాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు ఉంటే పదుల సంఖ్యలో పరిష్కరించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (యూడీఏ)ల పరిధి పెంపు, కొత్త యూడీఏల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే కలెక్టర్లు పంపించాలని ఆదేశించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రప్రభుత్వం 29 జిల్లాలకు, ఒక్కో జిల్లాకు మూడు కోట్ల రూపాయల చొప్పున.. ఖమ్మం, సూర్యపేట, కొత్తగూడెం, మహబూబాబాద్ నాలుగు జిల్లాలకు ఒక్కో జిల్లాకు ఐదు కోట్ల రూపాయల చొప్పున.. మున్సిపాలిటీలకు కోటి రూపాయలు.. కార్పొరేషన్లకు రెండు కోట్ల రూపాయల చొప్పున కేటాయించామని తెలిపారు. వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే రిపేర్లు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, అంగన్ వాడీ కేంద్రాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి మరమత్తులు చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్. చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
7,144 వడ్ల కొనుగోలు కేంద్రాలు
తమ ప్రభుత్వం ఎన్నికల్లోని హామీని నిలబెట్టుకుంటూ 35 సన్న రకాల వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అందిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా 7,144 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని.. సన్న ధాన్యానికి, దొడ్డు ధాన్యానికి వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. 50 లక్షల టన్నుల వరకు సన్నరకాలు, 30 లక్షల టన్నుల వరకు దొడ్డు రకం వడ్లు వస్తాయని అంచనా వేస్తూ దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. రైతాంగానికి ఏ చిన్న సమస్య రాకుండా కొనుగోళ్ల ప్రక్రియను కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.