బీఆర్​ఎస్​ క్యాండిడేట్లను అసెంబ్లీ గేటు తాకనీయం

బీఆర్​ఎస్​ క్యాండిడేట్లను  అసెంబ్లీ గేటు తాకనీయం
డబ్బు, అధికార మదంతో మాట్లాడుతున్నది కేసీఆరే: పొంగులేటి
కేసీఆర్  పతనానికి చివరిమెట్టు మేడిగడ్డ
ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మీరు కోట్లు సంపాదించారు 
కాంగ్రెస్​కు 80 నుంచి 82 సీట్లు ఖాయమని వెల్లడి

ఖమ్మం, వెలుగు:   ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తామని, బీఆర్​ఎస్​ క్యాండిడేట్లను ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనీయమని పీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్​ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. 80 నుంచి 82 సీట్లతో కాంగ్రెస్ ​అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. శనివారం ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్​పతనానికి చివరిమెట్టు మేడిగడ్డ ప్రాజెక్టు అని అన్నారు. 2014, 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసీఆర్​కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 

పాలేరు సభలో కేసీఆర్​ చేసిన కామెంట్స్​పై పొంగులేటి ఫైరయ్యారు. కేసీఆర్​కు తన పేరు ఎత్తే దమ్ము లేకనే ఏదేదో మాట్లాడారని, అదే తన పేరును బయటకు చెప్పి ఉంటే తన సత్తా ఏంటో అక్కడే తెలిసేదన్నారు. అక్కడి జనం నుంచి వచ్చే ఈలలు, కేకలతో కేసీఆర్ కు గుండెపోటు వచ్చేదని ఎద్దేవా చేశారు. ‘‘సభలో కేసీఆర్ పక్కన కూర్చున్న వారు ఏ పార్టీలో గెలిచారో తెలియదా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది నువ్వు. డబ్బు, అధికార మదంతో మాట్లాడేది నువ్వు.

 నాలుగు కాంట్రాక్టులు, పైరవీలు చేసి డబ్బు సంపాదించామా?  నాకిచ్చిన నాలుగు కాంట్రాక్టులు, నాకోసం మీరు చేసిన నాలుగు పైరవీలు ఏంటో చెప్పగలరా. తడిబట్టలతో ప్రమాణం చేద్దామా?  నేను వ్యవసాయం, కాంట్రాక్టులు చేసి డబ్బు సంపాదించా. నా ఆస్తుల వివరాలన్నీ అఫిడవిట్ లో చూపిస్తున్నా, నీ ఆస్తి వివరాలను చూపించగలవా? మీకు, మీకుటుంబానికి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి?” అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

కాళేశ్వరంను ఏటీఎంలా వాడుకున్నరు

ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఇలాంటి సీఎం దేశంలోనే లేడని పొంగులేటి విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టు మేడిపండులా ఉందని, కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ​ ఏటీఎంలా వాడుకుందని అన్నారు. ఎలక్షన్​ కమిషన్​ రూల్స్​ ప్రకారం ప్రతి నియోజకవర్గంలో రూ.40 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయాలని, అందుకు సిద్ధమని ప్రమాణం చేయగలరా? అని ప్రశ్నించారు. కొడుకు, అల్లుడు, కొంతమంది కేసీఆర్​ తొత్తులు వందలసార్లు తన దగ్గరకి వస్తేనే బీఆర్​ఎస్​లో చేరానన్నారు. 

దమ్ముంటే పాలేరులో తనపై పోటీ చేయాలని కేసీఆర్​కు సవాల్​విసిరారు. సత్తుపల్లిలో అందరికీ దళితబంధు తొలి విడతలోనే ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. హుజూరాబాద్​లో దళితబంధు ఇచ్చినా కేసీఆర్​కు ఎవరూ ఓట్లు వేయలేదని చెప్పారు. కేసీఆర్​ను ఇంటికే పరిమితం చేస్తామని, ధరణితోపాటు కేసీఆర్​ను, ఆయన తొత్తుల్ని తరుముతామన్నారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నేతలు రాయల నాగేశ్వరరావు, జావెద్​ తదితరులు ఉన్నారు.