- దేశానికి రోల్ మోడల్‌గా ఉండేలా కొత్త రెవెన్యూ చట్టం
- ట్యాంపరింగ్ చేయకుండా భూ రికార్డుల డిజిటలైజేషన్
- 17 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా
- 33 జిల్లాలకు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కల్లెక్టర్ పోస్టులు క్రియేట్ చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కొత్త రెవెన్యూ చట్టం రాకముందే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి, సామాన్యుడికి అందుబాటులో ఉండేలా సేవలను తీసుకురాబోతున్నట్టు చెప్పారు. 33 జిల్లాల్లో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను క్రియేట్ చేయనున్నట్టు తెలిపారు. అలాగే, 17 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను పూర్వస్థానాలకు ట్రాన్స్ఫర్ చేసేవిషయంపై దసరాలోపే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఎవరూ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నా, ఎవరూ కూడా ప్రభుత్వ భూముల రికార్డులను ట్యాంపరింగ్ చేయకుండా ఉండేలా యుద్ధప్రాతిపదికన డిజిటలైజేషన్ చేపడుతామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో 272 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కల్లెక్టర్లు, డిప్యూటీ కల్లెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్తగా ఉద్యోగంలో చేరినవారితో పాటు సర్వీస్ లో ఉన్న ప్రతి ఒక్కరికీ శిక్షణ తప్పనిసరి చేస్తామని తెలిపారు. రెవెన్యూ విభాగం ఉద్యోగులకు సంబంధించి జాబ్ చార్ట్ రూపొందించాలని, ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని సూచించారు. దేశానికి రోల్ మోడల్ గా ఉండేలా కొత్త రెవెన్యూ చట్టం–-2024ను తీసుకురాబోతున్నామని తెలిపారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లా యాచారం మండలాల్లో పైలెట్ ప్రాజెక్ట్ ను నిర్వహిస్తున్నామని. అక్కడ ఎదురయ్యే సమస్యలు, మంచి చెడులను పరిగణనలోకి తీసుకుని చట్టాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. తిరుమలగిరి మండలంలో పర్యటించి, రైతులతో మాట్లాడానని చెప్పారు.
ఈ ఒక్క మండలంలోనే 4,380 ఎకరాల్లో సర్వే నిర్వహిస్తే 1,300 ఎకరాలు మోఖా మీద లేని వారికి పాసుబుక్కులు ఉన్నాయనే విషయం బయటపడిందన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఏ మాత్రం రాజీపడొద్దని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. ప్రతి 3 నెలలకోసారి రాష్ట్ర, జిల్లాస్థాయిలో కోర్టుకు సంబంధించిన భూముల విషయంలో లీగల్ టీంతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
200 మండలాల్లో సొంత భవనాలు లేవు..
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు వీలైనంత ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రెవెన్యూ యంత్రాంగం చాలా బాగా పనిచేసిందని మంత్రి పొంగులేటి అభినందించారు. ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఆర్థికేతర అంశాలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు చెప్పినట్టుగా యునిఫార్మ్ గా అందరికీ ఒకేరకమైన వాహనాలు ఉండాలన్న ఆలోచన మంచిదని, అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు.
గత ప్రభుత్వం మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను పెంచింది కానీ.. అక్కడ మౌలిక సదుపాయాలను విస్మరించిందని అన్నారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. గత 9 నెలల్లో రెవెన్యూ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ప్రజలకు అనువైనవిధంగా సంస్కరణలు చేపట్టామని తెలిపారు.
లచ్చిరెడ్డి ప్రతిపాదనలు.. వేదికపైనే మంత్రి గ్రీన్ సిగ్నల్
డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి ఉద్యోగుల తరఫున పలు ప్రతిపాదనలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల కేడర్ స్ట్రెంత్పెంపు, సెలక్షన్ గ్రేడ్ గా నిర్ధారించి (33) పోస్టులు అప్ గ్రేడ్ చేయడం, 17 మంది సీనియర్ అదనపు కలెక్టర్ కేడర్ అధికారులకు ఐఏఎస్‌గా పదోన్నతి, డిప్యూటీ కలెక్టర్ నుంచి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా( 50 మందికి) ప్రమోషన్, 33 జిల్లాల్లో డీఆర్వో పోస్టుల భర్తీ, దసరా కానుకగా తహసీల్దార్ల ఎన్నికల బదిలీలు పూర్తి చేయడం, గ్రామానికో రెవెన్యూ అధికారిని నియమించడం లాంటి వినతులను పరిశీలించాలని మంత్రిని కోరారు.
వీటికి సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి.. అంశాలవారీగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వేదికపైన ఉన్న రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ను ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టర్ అనుదీప్, తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ డిప్యూటీ కల్లెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కే చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి ఏ భాస్కర రావు, డిప్యూటీ కల్లెక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.