
తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘన కేసీఆర్ దని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రూ.లక్ష కోట్లకు పైగా కేసీఆర్ కుటుంబం ఖాతాల్లోకి పోయిందని అన్నారు. ఆ అక్రమ సంపాదనతో ప్రభుత్వా్న్ని కూల్చేస్తామని అంటున్నారని విమర్శించారు. డబ్బుందనే అహంకారంతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అంటున్నారని మండిపడ్డారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ కు కనీసం పర్మిషన్ తీసుకురాలేకపోయిన బీఆర్ఎస్ కు తమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు.
ALSO READ | పిల్ల కాకులతో నాకెందుకు.. కేసీఆర్ను రమ్మను మాట్లాడదాం : సీఎం రేవంత్
గోదావరి ప్రాంతంలో పంటలు ఎండిపోవటానికి కారణం బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. స్టేషన్ ఘన్ పూర్ లో రూ.800 కోట్ల అభివృద్ధి కార్యమాల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులతో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పంటలు ఎండి పోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీనేనని అన్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం తీవ్ర నష్టం కలిగిందని, దీంతో పంటలు ఎండిపోయాయని అన్నారు. అదే విధంగా కృష్ణా నీటిని ఆంధ్రకు వదిలేసి ఈ నాడు పంటలు ఎండటానికి కేసీఆర్ కారకులయ్యారని విమర్శించారు.
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోకి రూ.8 వందల కోట్ల నిధులు తెచ్చిన ఘనత కడియం శ్రీహరిదని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ఇప్పటి వరకు ఎవ్వరూ ఇన్ని నిధులు ఈ నియోజకవర్గానికి తీసుకురాలేదని అన్నారు.
తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్షా 58 వేల కోట్ల అప్పు చేశామని అంటున్నారని, ప్రతి నెల రూ.6 వేల 500 అసలు వడ్డీ కడితేనే దేశంలో మన రాష్ట్రానికి గౌరవం ఉంటుందని , కేసీఆర్ అలాంటి పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు మంత్రి పొంగులేటి. రూ.8 లక్షల 18 వేల కోట్ల అప్పు మా నెత్తిన పెట్టి.. సుమారు లక్ష కోట్లు మింగేశారని విమర్శించారు.
నోరు విప్పితే ముత్యాలు రాలుతాయన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని.. మాట్లాడితే నిజాలు బయటపడతాయనే మాట్లాడటం లేదని.. అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు.