లోపాలు బయటపడ్తాయనే..విద్యుత్​సప్లై లాగ్​బుక్‍లు మాయం

  • గత బీఆర్ఎస్ సర్కారులో ఎవరికీ స్వేచ్ఛ లేదు
  • ఏది చేయాలన్నా ఆ కుటుంబం నుంచి ఆర్డర్స్​రావాల్సిందే
  • ప్రజా పాలనలో మంత్రులు పొంగులేటి, సురేఖ, సీతక్క ఫైర్

వరంగల్‍, వెలుగు :  గత బీఆర్ఎస్  ప్రభుత్వంలో ఎవరికీ స్వేచ్ఛ ఉండేది కాదని, ఏం చేయాలన్నా కల్వకుంట్ల కుటుంబం నుంచి ఆదేశాలు రావాల్సిన పరిస్థితులు ఉండేవని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి, కొండా సురేఖ, సీతక్క అన్నారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‍లో ఉమ్మడి వరంగల్  జిల్లా కలెక్టర్లు, సీపీ, ఎస్పీలతో జిల్లా ఇన్ చార్జి మంత్రి పొంగులేటి, మంత్రులు కొండా సురేఖ, సీతక్క రివ్యూ నిర్వహించారు. 

అనంతరం మీడియా సమావేశంలో శ్రీనివాస్‍రెడ్డి మాట్లాడారు. విద్యుత్  సరఫరాలో లోపాలు బయటపడ్తాయనే లాగ్‍బుక్‍లు మాయం చేశారని ఆయన ఆరోపించారు. పేదవాడికి ఇండ్లు కట్టించకుండా ప్రభుత్వ పెద్దలు రాజసౌధాలు నిర్మించుకున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన హామీలు నేరవేరుస్తామని పేర్కొన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో జనం ఇచ్చే ప్రతి దరఖాస్తును అధికారులు స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. చివరి లబ్ధిదారుని వరకు దరఖాస్తులు తీసుకుని ఒక్కో దరఖాస్తుదారునికి 5 నిమిషాల సమయం కేటాయించాలని సూచించారు. 

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలి

ప్రజా పాలనలో అలసత్వం లేకుండా ప్రతి దరఖాస్తుకు సీరియల్  నంబర్  ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలని ఆమె కోరారు. అనుకున్న హామీలను నెరవేర్చే క్రమంలో ఏమైనా లోపాలున్నా సరిదిద్దుకోవడానికి రెడీగా ఉన్నామని తెలిపారు. మీడియా స్వేచ్ఛగా పని చేసుకునే వాతావరణం కల్పిస్తామన్నారు. 

మంత్రి సీతక్క మాట్లాడుతూ బీఆర్‍ఎస్ నేతలు ప్రవేశపెట్టింది స్వేద పత్రం కాదని, అది స్వాహాపత్రామని ఎద్దేవా చేశారు. పదేళ్లలో తెలంగాణకు బీఆర్ఎస్  చేసిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్  రామచంద్రు నాయక్‍, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్‍ నాగరాజు, కలెక్టర్లు సిక్తా పట్నాయక్‍, ప్రావీణ్య, శశాంక తదితరులు పాల్గొన్నారు.