- ఐఎన్టీయూసీని గెలిపిస్తే సింగరేణి డే రోజు సెలవు
- 250 గజాల స్థలంతో పాటు రూ. 20 లక్షల వడ్డీ లేని రుణం
- అండర్‌గ్రౌండ్‌లో పని చేసే యూత్‌కు చదువుకు తగ్గ జాబ్
- మహిళా కార్మికులకు సర్ఫేస్‌లో పని..
భద్రాద్రికొత్తగూడెం/ ఇల్లెందు, వెలుగు : బంగారు సింగరేణిని అప్పులు తెచ్చుకునే దుస్థితికి తీసుకొచ్చిన ఘనత గత బీఆర్ఎస్సర్కార్కే దక్కిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. సింగరేణి గుర్తింపుసంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీని గెలిపించాలని సోమవారం కొత్తగూడెం ఏరియాలోని పీవీకే -5 ఇంక్లైన్‌తో పాటు డిపార్ట్మెంట్లు, కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్, ఇల్లెందు జేకే5 ఓసీలో జరిగిన ఫిట్మీటింగ్లో పాల్గొని ప్రచారం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ బ్యాంకుల్లో అప్పులు తేనిదే కార్మికులకు నెలనెలా జీతాలివ్వలేని దీన స్థితికి సింగరేణిని దిగజార్చేలా చేసింది గత బీఆర్ఎస్సర్కారే అని అన్నారు. గుర్తింపు సంఘంగా ఐఎన్టీయూసీని గెలిపిస్తే సింగరేణి డేను సెలవు దినంగా ప్రకటించేలా యాజమాన్యంతో మాట్లాడుతామన్నారు. కంపెనీలో పనిచేస్తున్న వారి సొంతింటి కల నెరవేరేలా 250 గజాల స్థలంతో పాటు రూ. 20లక్షలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తామన్నారు. అండర్గ్రౌండ్మైన్లలో పనిచేస్తున్న యువ కార్మికులకు వారి చదువుకు తగ్గట్లు సూటబుల్జాబ్స్ ఇప్పించేలా కృషి చేస్తానన్నారు.
అండర్‌గ్రౌండ్‌లో పనిచేస్తున్న మహిళా కార్మికులకు సర్ఫేస్‌లో పనిచేసేలా యాజమాన్యంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఇల్లెందులో జేకే ఓసీ విస్తరణలో ఇక్కడ విధులు నిర్వహించే కార్మికులు ఇతర ఏరియాలకు బదిలీ కాకుండా చూసే బాధ్యత తనదేనన్నారు. కారుణ్య నియామకాల కోసం రూ. 4లక్షల నుంచి రూ. 5లక్షలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి గతంలో ఉండేదన్నారు. సింగరేణిలో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ఏర్పాటు చేసి కార్మికులకు నాణ్యమైన వైద్యసేవలందిస్తామన్నారు. పెర్క్అలవెన్సులపై ఐటీని యాజమాన్యమే కట్టేలా కృషి చేస్తామన్నారు.
ఉద్యోగాలిచ్చామని ఘనంగా చెప్పుకున్న బీఆర్ఎస్ సింగరేణిలో తొమ్మిదిన్నరేండ్లలో 14వేల ఉద్యోగులను తగ్గించిందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను తరిమికొట్టినట్టుగానే ఆ పార్టీ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్‌ను సింగరేణి నుంచి వెళ్లగొట్టాలన్నారు. వారంలో ఒకరోజు కొత్తగూడెంలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తానన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీకి చెందిన గడియారం గుర్తుపై ఓటేయాలని కోరారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయ, ఐఎన్టీయూసీ, కాంగ్రెస్‌నేతలు పాల్గొన్నారు.