ఇక భరించడం నా వల్ల కాదు: పొంగులేటి

  • మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి సంచలన కామెంట్స్
  • కేటీఆర్​ను నమ్మి టీఆర్ఎస్​లో చేరినందుకు అన్నీ అవమానాలే
  • ఉమ్మడి ఏపీలోనే టాప్​10 బడా కాంట్రాక్టర్లలో నేనొకడిని
  • కాంట్రాక్టులు చేసి ఎవరెవరికి ఎంత ఇచ్చానో త్వరలోనే ప్రకటిస్తా
  • బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతరు

మణుగూరు, వెలుగు: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  మరోసారి సంచలన కామెంట్స్​చేశారు. బీఆర్ఎస్​లో జరిగిన అవమానాలు, అగౌరవాలు ఇక చాలని.. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  పినపాక నియోజకవర్గం పరిధిలోని మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి  ఆయన శ్రీకారం చుట్టారు.  కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ ను నమ్ముకొని టీఆర్ఎస్ లో చేరిన తనకు అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  అన్నారు. కేటీఆర్ తో ఉన్న అనుబంధం మూలంగా ఎన్నో అవమానాలు భరించిన తాను ఇకపై మౌనంగా ఉండడం సరికాదన్నారు. తనను నమ్ముకున్న నేతలు, కార్యకర్తలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ భరించడం తన వల్ల కాదన్నారు. గన్ మెన్లను తాను అడగకుండానే ఇచ్చారని, తనకు చెప్పకుండానే తీసేశారని, లక్షలాదిమంది అభిమానులను కూడగట్టుకున్న తనకు ఏ గన్ మెన్ లు అవసరం లేదన్నారు . ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తనను వాడుకున్న బీఆర్ఎస్ నేతలు తనకిచ్చిన గౌరవం ఏపాటిదో తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలు తిరస్కరించడం వల్లనో.. ఓడించడం వల్లనో తాను ఇంట్లో కూర్చోలేదని,  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒంటరివాడు కాదన్నారు. కాంట్రాక్టు పనుల కోసం బీఆర్ఎస్ లో చేరి కోట్లు సంపాదించాడని వస్తున్న ఆరోపణలు అవాస్తమని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే  టాప్​ 10 బడా కాంట్రాక్టర్ల లో తాను ఒకడినన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వంలో తాను చేసిన ప్రతి కాంట్రాక్టు పని కోసం ఎవరెవరికి ఎంత ఇచ్చింది త్వరలోనే వెల్లడిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉంది కదా అని అసెంబ్లీని సామ్రాజ్యంలా మార్చుకొని ప్రజలను దోచుకుంటున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. 

నేను సంక్రాంతికి వచ్చిపోయే గంగిరెద్దును కాదు: పాయం

తాను సంక్రాంతికి వచ్చిపోయే గంగిరెద్దును కాదని ప్రజల మధ్య ఉండే నిజమైన లీడర్​నని మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్​ లీడర్లపై పాయం ఫైర్​ అయ్యారు. పొంగులేటిని చూసి  విప్ రేగా కాంతారావుకు నిద్ర పట్టడం లేదన్నారు. అర్ధరాత్రి జనమంతా నిద్రలో ఉన్నప్పుడు రేగా స్థిమితం కోల్పోయి సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గానికి తాను రూ.400 కోట్ల నిధులు మంజూరు చేయిస్తే వాటికి కొబ్బరికాయలు కొడుతూ కాలక్షేపం చేస్తున్న కాంతారావు ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలని పాయం డిమాండ్ చేశారు. సమావేశంలో తుళ్లూరి బ్రహ్మయ్య, మువ్వా విజయ్ బాబు, జారే ఆదినారాయణ, ముత్తినేని సుజాత, ఎండి షర్ఫుద్దీన్, కరివేద వెంకటేశ్వరరావు, కమటం నరేశ్​, పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పుచ్చకాయ శంకర్ తదితరులు పాల్గొన్నారు.