బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. వరదలను కూడా రాజకీయం చేస్తున్నారని.. శవాల మీద పేలాలు ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపద్రవం వస్తే దీన్ని కూడా బీఆర్ఎస్ నేతలు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అతి భారీ వర్షాల కారణంగా ఖమ్మంలో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు పొంగులేటి.
వర్షాలు,వరదలపై ఖమ్మం కలెక్టరేట్ లో సీఎం రేవంత్ రివ్యూ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన పొంగులేటి.. అతి భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. జిల్లాలో వాగులు వంకలు కనీవిని ఎరగని రీతిలో ఉప్పొంగాయన్నారు. ఖమ్మంలో ఎప్పుడు లేనంతగా వరద ముంచెత్తిందన్నారు. ప్రాణ నష్టం జరగకుండా శతవిధాల ప్రయత్నించాం.. వాతావరణం అనుకూలించకపోవడంతో కొన్ని చోట్ల ఇబ్బంది తలెత్తిందని చెప్పారు. వరద బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు.ప్రతిపక్షాల బురద రాజకీయాలు చేస్తున్నాయని..ప్రజలు దీన్ని గమనించాలని సూచించారు.