బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఏ ఒక్క అభ్యర్థి కూడా ప్రజలు అసెంబ్లీ గేటు తాకలేరని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు అదే తీర్పు ఇవ్వబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం సిద్ధినగరం గ్రామంలో ఆయన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు పొంగులేటికి ఘన స్వాగతం పలికారు.
సీఎం కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీచేయడానికి అర్థం ఏంటో ఇప్పుడు అర్థమైందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఓటమిని ఆయనే గ్రహించి.. రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్నారన్నారు. తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉంటారని తెలిపారు.
ALSO READ : రామ్ డబుల్ ఇస్మార్ట్ లో..గల్లీ గ్యాంగ్ లీడర్గా ఆకాష్ పూరి!
ఎన్నికల సమయంలో ఓట్ల కోసమే కేసీఆర్‌కు రైతు రుణమాఫీ గుర్తుకొచ్చిందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. లక్ష రూపాయల రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతుంది కానీ.. అందులో రూ. 80వేలు వడ్డీకి పోగా రైతులకు మిగిలిన లాభం రూ. 20 వేల రూపాయలే మాత్రమేనన్నారు. 2014లో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అప్పుడే రుణ మాఫీ చేసి ఉంటే.. రైతులందరికీ లాభం జరిగేది.. కానీ ఇప్పుడు రుణమాఫీతో రైతులకు ఓరిగేది ఏమీ లేదన్నారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల హామీలను తప్పకుండా అమలు చేస్తుందన్నారు పొంగులేటి. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తాను అండగా ఉంటానని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన హామీ ఇచ్చారు.