ఖమ్మం, వెలుగు: ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలనంగా మారారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి, ఐదు నెలల్లోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. రేవంత్ రెడ్డి కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. తొలి నుంచి పొంగులేటి ప్రస్థానం సంచలనంగానే సాగింది. కేసీఆర్తో విభేదించిన పొంగులేటి బీఆర్ఎస్ను విడిచిపెట్టాల్సి వచ్చింది.
జులై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు.
కేసీఆర్ ను సవాల్ చేస్తూ అనేక బహిరంగ సభల్లో మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం పనిచేశారు. ఎన్నికల్లో పాలేరు నుంచి బరిలోకి దిగి ఏకంగా 56వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం అనూహ్యంగా కేబినెట్ లో స్థానాన్ని
సంపాదించుకున్నారు.
కేసీఆర్ ను సవాల్ చేసి మరీ...
పొంగులేటి కాంగ్రెస్ లో చేరికకు ముందు దాదాపు ఆర్నెళ్ల పాటు అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. బీఆర్ఎస్ లో తాను ఎదుర్కొంటున్న అవమానాలను జనవరి 1న బయటపెట్టిన పొంగులేటి .. అదే రోజు తొలిసారిగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఆయన్ను పార్టీలో కొనసాగించేందుకు రకరకాల ప్రయత్నాలు జరిగినా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాయబారాన్ని నడిపించినా పొంగులేటి పట్టించుకోలేదు.
బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించగా, ఆ మీటింగ్ కు పొంగులేటిని రప్పించేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాల్లో పొంగులేటి డైరెక్ట్ గా కేసీఆర్నే టార్గెట్ చేశారు. ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనియ్యనంటూ శపథం చేశారు.
అయితే భద్రాచలంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక్క అభ్యర్థి కూడా పొంగులేటి అనుచరుడే కావడం గమనార్హం. దాదాపు పదేళ్లుగా పొంగులేటి వెంట ఉన్న తెల్లం వెంకట్రావు, ఎన్నికలకు నెల రోజుల ముందు కాంగ్రెస్ లో భద్రాచలం టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంలో పొంగులేటిని వీడి బీఆర్ఎస్ లో చేరారు. ఆయన కూడా త్వరలోనే కాంగ్రెస్ లోకి వస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతున్నా, వెంకట్రావు ఖండించారు.
మొదటి నుంచి సంచలనాలే..!
పొంగులేటి పొలిటికల్ కెరీర్ లో మొదటి నుంచి సంచలనాలే. 2014 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న సమయంలోనే వైసీపీ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలవడంతోపాటు, మరో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు.
ఆ తర్వాత వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2016లో పాలేరు ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ ఆహ్వానంతో బీఆర్ఎస్ లో చేరారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నా 2019 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ టికెట్ దక్కకున్నా, కేటీఆర్ ను నమ్ముకొని పార్టీలోనే ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అని, రాజ్యసభ సీటు అని ప్రచారం జరిగినా ఏదీ పొంగులేటి దగ్గరకు రాలేదు. దీంతో మూడేళ్ల పాటు తనను కలిసేందుకు కూడా కేసీఆర్ ఆసక్తి చూపించలేదని, పార్టీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నానంటూ పొంగులేటి పార్టీ నుంచి బయటకు వచ్చారు.