కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నడు .. రెండు సార్లు ప్రజలను మోసం చేసిండు : పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

కేసీఆర్  లక్షల కోట్లు దోచుకున్నడు ..  రెండు సార్లు ప్రజలను మోసం చేసిండు : పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్  లక్షల కోట్లు దోచుకున్నారని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.  వనపర్తి జిల్లా కేంద్రం, నల్లగొండ జిల్లా కట్టంగూర్, రామన్నపేట మండలాల్లో సోమవారం నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ప్రజలను సీఎం రెండుసార్లు మోసం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్  పాలకుల దోపిడీ రాజ్యాన్ని తరిమికొట్టి ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నారు. తొమ్మిదిన్నర ఏండ్ల కేసీఆర్  పాలనలో ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని, బీఆర్ఎస్  నేతల ఆస్తులు మాత్రమే పెరిగాయని విమర్శించారు. 

వనపర్తి కాంగ్రెస్  అభ్యర్థి మేఘా రెడ్డి మచ్చలేని నాయకుడని, కబ్జాల మంత్రి నిరంజన్ రెడ్డి మాదిరి చెరువులు, దేవాలయ భూములు, కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేయలేదని చెప్పారు. మేఘా రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిన్నారెడ్డి, రాష్ట్ర యూత్  కాంగ్రెస్  అధ్యక్షుడు శివసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ధరణిని అడ్డం పెట్టుకుని 50 లక్షల కోట్లు తిన్నరు

ధరణిని అడ్డుపెట్టుకొని కేసీఆర్  కుటుంబం రూ.50 లక్షల కోట్లు మింగిందని పొంగులేటి శ్రీనివాస్  రెడ్డి అన్నారు. అవినీతి సొమ్ముతో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్  ప్రయత్నిస్తున్నారని, ఈసారి ఆయనకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ధర్మం, అధర్మం మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఉచిత విద్యుత్ పై రేవంత్  రెడ్డి అన్న మాటలను వక్రీకరించి ప్రజలను, రైతులను కేసీఆర్  తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టిందే కాంగ్రెస్  పార్టీ అని తెలిపారు.