ఖమ్మం కాంగ్రెస్​లో.. పొంగులేటి పాలిటిక్స్​​

  • ఖమ్మం కాంగ్రెస్​లో.. ‘పొంగులేటి’ పాలిటిక్స్​​ 
  • అశ్వారావుపేట, సత్తుపల్లి టూర్లలో బయటపడ్డ విభేదాలు
  • కలుపుకొని పోవడం లేదని కాంగ్రెస్​ నేతల ఆవేదన 
  • సోషల్ మీడియాలో దయానంద్​ అనుచరుల పోస్టులు 
  • గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని ‘తాటి’ ఫైర్​
  • ఇదే అదనుగా వర్గపోరుపై  అధికార పార్టీ నేతల సెటైర్లు 

ఖమ్మం, వెలుగు:  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి పర్యటనలు కాంగ్రెస్​ పార్టీలో  కాక రేపుతున్నాయి. నియోజకవర్గాల పర్యటన సందర్భంగా తన వర్గం నేతలను వెంటేసుకొని తిరుగుతున్న ఆయన, మిగిలిన వర్గాలను పక్కనపెట్టడంపై విమర్శలు వస్తున్నాయి.  రాష్ట్ర కాంగ్రెస్​ ప్రచార కమిటీ కో చైర్మన్​ గా ఉన్న పొంగులేటి ఖమ్మంలో గ్రూపు పాలిటిక్స్​ ప్రోత్సహించడం ఏమిటంటూ కాంగ్రెస్​ నేతలు ఎటాక్​ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పర్యటనపై మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మీడియా ముందే  విమర్శలు చేయగా, సత్తుపల్లి పర్యటన మీద మట్టా దయానంద్​ వర్గీయులు..తమకు కనీస సమాచారమివ్వకపోవడాన్ని ప్రశ్నిస్తూ  సోషల్​ మీడియా గ్రూపుల్లో బహిరంగ లేఖ పేరుతో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఇదే అదనుగా అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్​లో పొంగులేటి మార్క్​ పాలిటిక్స్​ మొదలయ్యాయంటూ సెటైర్లు వేస్తున్నారు. 

కావాలనే దూరం పెడ్తున్నరా?

బీఆర్ఎస్​ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి, ఈనెల 2న ఖమ్మంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో గ్రూపు రాజకీయాలకు, వర్గ విభేదాలకు అవకాశం ఇవ్వకుండా అందరినీ కలుపుకొని పోతానని చెప్పిన ఆయన, ఆచరణలో మాత్రం పాటించడం లేదని ఆ పార్టీలోని కొందరు లీడర్లు విమర్శిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్​ ప్రచార కమిటీ కో చైర్మన్​ గా పొంగులేటి నియమితులయ్యారు. రీసెంట్ గా అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించారు. అశ్వారావుపేట టూర్​ కు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ములకలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి వర్గం దూరంగా ఉన్నారు. తమను పిలవకుండానే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఈ ఇద్దరు నేతలు ఆరోపిస్తున్నారు. 

మాజీ ఎమ్మెల్యే తాటి మాత్రం తాను పీసీసీకి కంప్లయింట్​ చేస్తానని చెప్పారు. అదే రోజు సాయంత్రం సత్తుపల్లి టూర్​ కు మట్టా దయానంద్​ వర్గం దూరంగా ఉన్నారు. సత్తుపల్లి నుంచి నలుగురు కాంగ్రెస్​ టికెట్ ఆశిస్తుండగా, అందులో ముగ్గురిని కార్యక్రమానికి పిలిచి, ఒక్కరిని పక్కనపెట్టడం ఏమిటని దయానంద్​ అనుచరులు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం పొంగులేటిపై విమర్శలు చేస్తున్న తాటి వెంకటేశ్వర్లు, మట్టా దయానంద్​ ఇద్దరూ గతంలో ఆయన అనుచరులే కావడం గమనార్హం. 

నాలుగు మెట్లు దిగుతానని..

పొంగులేటి 2014లో వైసీపీ తరపున ఖమ్మం ఎంపీగా గెలిచిన సమయంలో వైసీపీ తరపున అశ్వారావుపేట నుంచి తాటి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత పొంగులేటి వెంట టీఆర్ఎస్​లో చేరారు. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయారు. అక్కడ టీడీపీ తరపున గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు ఆ తర్వాత బీఆర్ఎస్​ లో చేరగా, తనకు పార్టీలో ప్రాధాన్యత లేదంటూ గతేడాది తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్​లో చేరారు. బీఆర్ఎస్​లో ఉన్నప్పటి నుంచే పొంగులేటిని విభేదించి ఆయనకు దూరంగా ఉన్నారు. దీంతో తన వర్గం అభ్యర్థిగా జారే ఆదినారాయణను పొంగులేటి ప్రకటించారు. ఆ తర్వాత పరిణామాల్లో ఆయన కూడా కాంగ్రెస్​ లో చేరారు. అయినా గత విభేదాల దృష్ట్యా తాటిని పొంగులేటి దూరం పెడ్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇక సత్తుపల్లి లీడర్​ డాక్టర్​ మట్టా దయానంద్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. 2014లో సత్తుపల్లిలో వైసీపీ తరపున పోటీ చేసి, కొద్ది ఓట్ల తేడాతో సండ్రపై ఓడిపోయారు. తర్వాత పొంగులేటి వెంట అప్పటి టీఆర్ఎస్​ చేరారు. 2018లో టీఆర్ఎస్​ తరపున టికెట్ ఆశించినా దక్కలేదు. కొద్ది నెలల క్రితం పొంగులేటితో విభేదించి, ఆయన కంటే ముందుగానే దయానంద్​ కాంగ్రెస్ లో చేరారు. సత్తుపల్లి పర్యటనకు రెండ్రోజుల ముందు కూడా పొంగులేటిని దయానంద్​ కలిసి సన్మానించారని, అయినా కావాలనే పొంగులేటి దూరం పెట్టారని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీనిపై 8  ప్రశ్నలతో సోషల్​ మీడియాతో పోస్టింగులు పెట్టారు. అందరినీ కలుపుకొని పోయేందుకు నాలుగు మెట్లయినా దిగుతాను అని చెప్పి, ఇప్పుడెందుకు ఇలా అంటూ బహిరంగ లేఖను విడుదల చేశారు. 

రేణుక అనుచరులకూ సమాచారం ఉంటలే..

ప్రచార కమిటీ కో చైర్మన్​ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పొంగులేటి ముందుగా వైరాలో భారీ బైక్​ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రేణుకాచౌదరి అనుచరుడిగా వైరా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ధరావత్ రామ్మూర్తి నాయక్​ కు ఆహ్వానం అందలేదని కాంగ్రెస్​ కార్యకర్తలు చెబుతున్నారు. మరోవైపు ఇదే అదనుగా కాంగ్రెస్​లోని వర్గ విభేదాలపై బీఆర్ఎస్​ నేతలు పొంగులేటిని కౌంటర్​ చేస్తున్నారు. సత్తుపల్లిలో నాలుగు కాంగ్రెస్​ క్యాంప్​ ఆఫీసులను తీసేసి, ఒక్కటే పెట్టి నడిపించగల సత్తా ఉందా..? అంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రశ్నించారు. సత్తుపల్లిలో కేసీఆర్​ తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని, మీ అభ్యర్థి ఎవరో ప్రకటించే దమ్ముందా..? అని సవాల్ చేశారు.