రెవెన్యూ డివిజన్ దిశగా చేర్యాల..ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ 

రెవెన్యూ డివిజన్ దిశగా చేర్యాల..ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ 
  • సిద్ధం చేస్తున్న జిల్లా కలెక్టర్

సిద్దిపేట/చేర్యాల, వెలుగు: చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల పునర్విభజన జరిగినప్పటి నుంచి చేర్యాల రెవెన్యూ డివిజన్ గా  ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్​ఎస్​పార్టీలు సైతం చేర్యాల రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటుకు  హామీ ఇచ్చారు. ఇటీవల చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై జేఏసీ ఏర్పాటు చేసి ఆందోళనలు నిర్వహించడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 

కలెక్టర్ ప్రతిపాదనలే కీలకం

ఇటీవల జేఏసీ నాయకులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి చేర్యాల డివిజన్ ఏర్పాటు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనగామ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ విషయాన్ని గుర్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ తరపున చేర్యాల డివిజన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని  కలెక్టర్ కు ఆదేశాలు అందినట్టు సమాచారం.

చేర్యాల మున్సిపాలిటీతో పాటు 16 గ్రామాలు, కొమురవెల్లి మండలంలో8, మద్దూరులో 18, ధూల్మిట్టలో 6 గ్రామాలతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో కలెక్టర్ ప్రభుత్వానికి పంపే ప్రతిపాదనలు కీలకంగా మారనున్నాయి. మరోవైపు 4 మండలాల సరిహద్దు గ్రామాలను సైతం చేర్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తీసుకొస్తారనే ప్రచారం జరుగుతోంది. 

8 ఏండ్లుగా రెవెన్యూ డివిజన్ కోసం ఆందోళనలు 

చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ 8 ఏండ్లుగా కొనసాగుతోంది.  బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో  కొత్తగా పరకాల, హుజూర్​నగర్, వేములవాడ, ​జోగిపేటను రెవెన్యూ  డివిజన్లుగా ప్రకటించి చేర్యాలకు మొండి చేయి చూపారు.  దీంతో చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం రాజకీయ పార్టీలు, స్టూడెంట్స్​, ఉద్యోగులు, యువకులు, వ్యాపార వాణిజ్య సముదాయల వారు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. మొదట చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన సమితి జేఏసీగా ఏర్పడి వివిధ రూపాల్లో  నిరసన వ్యక్తం చేశారు.

2016 లో జిల్లాల పునర్విభజనలో భాగంగా జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ లోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలు సిద్దిపేట జిల్లాలో కలపగా, తర్వాత  కొత్తగా ధూల్మిట్ట మండలాన్ని ఏర్పాటు చేశారు. చేర్యాల, కొమురవెల్లి   మండలాలు సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో, మద్దూరు, ధూల్మిట్ట మండలాలు హుస్నాబాద్ డివిజన్ పరిధిలో, ఏసీపీ, ట్రాన్స్ కో విభాగాలు హుస్నాబాద్​డివిజన్ పరిధిలో, కోర్టు వ్యవహారాలపై  సిద్దిపేట, జనగామకు వెళ్లే పరిస్థితి ఏర్పడడంతో స్థానికులకు ఇబ్బందికరంగా మారింది. గతంలో వ్యవసాయ శాఖ ఏడీ ఆఫీసు గజ్వేల్ లో కొనసాగినా రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని చేర్యాలలో ఏడీఏ ఆఫీసును ప్రారంభించారు. వేర్వేరు డివిజన్లలో వివిధ శాఖాధిపతులు ఉండడంతో ప్రజలు పాలనాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చేర్యాల రెవెన్యూ డివిజన్ కు మంత్రి మద్దతు

చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయలని మంత్రి కోమటి రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. గతంలో భువనగిరి ఎంపీగా ఎన్నో సార్లు చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరినా బీఆర్ఎస్​ప్రభుత్వం పట్టించుకోలేదనే విషయాన్ని గుర్తుచేశారు. ప్రజల న్యాయమైన కోరికను నెరవేర్చడానికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. 

 పార్టీలకు అతీతంగా ఉద్యమం


చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం పార్టీలకు అతీతంగా ఉద్యమిస్తున్నాం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ చేర్యాల డివిజన్ ఏర్పాటుకు హామీ ఇచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే చేర్యాల రెవెన్యూ డివిజన్ కార్యరూపం దాలుస్తుందని భావిస్తున్నా.- కొమ్ము రవి, చేర్యాల

రెవెన్యూ డివిజన్ తో  చేర్యాలకు పూర్వ వైభవం


రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో చేర్యాలకు పూర్వ వైభవం వస్తుంది. పరిపాలనాంశాల్లో ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయి. రెవెన్యూ డివిజన్​ కోసం 8 ఏళ్లుగా కొట్లాడుతున్నాం. ఇది పార్టీల ఎజెండా కాదు ప్రజల ఎజెండా. దీనిని సాధించే వరకు పోరాటాలు కొనసాగిస్తాం.- పరమేశ్వర్, జేఏసీ చైర్మన్