- బుద్ధి లేకనే సీఎం రేవంత్ రెడ్డిపై నిందలు
- తనపై ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- రైతుల పూర్తి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి పంటల బీమా పథకం అమలు చేస్తాం : మంత్రి తుమ్మల
నేలకొండపల్లి, వెలుగు : కనీస జ్ఞానం లేక ప్రతిపక్షాల నాయకులు సీఎం రేవంత్ రెడ్డిపై నిందలు మోపుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడుగా వెన్నపూసల సీతారాములు, ఉపాధ్యక్షులుగా సురేశ్, ఇతర పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారానికి మంత్రులు హాజరయ్యారు. బహిరంగ సభలో మంత్రి పొంగులేటి మాట్లాడారు.
ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా.. ప్రతీ ఇంటికి పరిహారం ఇచ్చామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో లక్షల కోట్లు దోచుకున్నదని ఆరోపించారు. రుణమాఫీ 14 వేల కోట్లు ఉంటే 8 వేల కోట్లే బీఆర్ఎస్ మాఫీ చేసిందన్నారు. అమృత్ స్కీమ్ లో అవినీతి జరిగిందని జ్ఞానం లేకుండా నిందలు మోపుతున్నారని విమర్శించారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానన్నారు. ‘ఎన్ని గంటలకు, ఎక్కడకు రావాలో చెప్పండి’ అని ఓపెన్ డిబేట్ కు మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. హైడ్రా చిత్త శుద్ధితో పని చేస్తోందని చెప్పారు. తన ఇల్లు బఫర్ జోన్ లో ఉంటే కూల్చమని హైడ్రా కమీషనర్ ను అదేశించానని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలపై సీరియస్
బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్, హరీశ్ రావుపై మంత్రి పొంగులేటి సీరియస్ ఆయ్యారు. ‘ముఖ్యమంత్రిని దించడానికి శ్రీనివాస్ రెడ్డి పన్నాగం పన్నాడని అంటున్నారు. మీకు, మీ బావ కు వివాదాలు ఉన్నాయనేది నిజం. ఇద్దరిలో ఎవరు వెన్నుపోటు పొడుచుకుంటారో ప్రజలకు తెలుసు. ముందు మీ పార్టీని చక్కబెట్టుకోండి’ అంటూ కేటీఆర్, హరీశ్‌రావు ను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఐదు సంవత్సరల్లో లక్ష రూపాయల రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్కు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3.500 ఇళ్లు ఇవ్వబోతున్నమని, సంక్రాంతి లోపే స్మార్ట్ కార్డ్ ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తామని తెలిపారు.
ఈ పంట నుంచే సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వనున్నమని పేర్కొన్నారు. నేలకొండపల్లి మార్కెట్ అభివృద్ధి చేస్తున్నామని, పాలేరు నియోజకవర్గంలో మంజూరు చేసిన మద్దులపల్లి మార్కెట్ పూర్తి చేసేందుకు 20 కోట్ల మంజూరు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లు రాయల నాగేశ్వరరావు, మువ్వ విజయ్ బాబు, నేతలు సాదు రమేశ్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శాఖమూరి రమేశ్ పాల్గొన్నారు.