- ఇచ్చిన హామీల అమలేది: పొంగులేటి
- అధికార మదంతో ఇబ్బంది పెట్టారు
- అధికారం ఎవడబ్బ సొత్తు కాదని కామెంట్
ఖమ్మం/మధిర, వెలుగు: బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. పార్టీ హైకమాండ్ పై డైరెక్ట్ అటాక్ చేశారు. ఇచ్చిన హామీల అమలేది? అని ప్రశ్నించారు. ‘‘ఏ ఉద్దేశంతో తెలంగాణ కావాలనుకున్నమో, రాష్ట్రం వస్తే ఎలాంటి లబ్ధి జరుగుతుందని జనం కోరుకున్నరో... అవన్నీ నెరవేర్చామా? లేదా? అనేది పెద్దలు ఆలోచించుకోవాలి” అని సూచించారు. సోమవారం ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం బోనకల్ లోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని అనేక వేదికల మీద చెబుతున్నం. కానీ నిజంగా 24 గంటల కరెంట్ వస్తుందా? డబుల్ బెడ్ రూమ్ఇండ్ల కోసం పేదలు ఎదురుచూస్తున్నరు? వాళ్లందరికీ ఇండ్లు ఇస్తామని భరోసా కల్పించామా?” అని ప్రశ్నించారు. ‘‘ఇప్పటి వరకు కేవలం 20 శాతమే రుణమాఫీ చేశాం. ఇంకా 80 శాతం చేయాల్సి ఉంది. ఇంకా ఆరెడు నెలల్లో మళ్లీ ఎన్నికలు వస్తాయి. హామీలు ఇవ్వడమే కాదు.. వాటిని నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రిని కోరుతున్నాను” అని అన్నారు.
నా అభ్యర్థులే గెలుస్తరు..
రానున్న ఎన్నికల్లో తాను నిలబెట్టే అభ్యర్థులే గెలుస్తారని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. ‘‘అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక్కటే చెబుతున్న. అధికారం ఎవడబ్బ సొత్తు కాదు. తలరాత ఎట్లుంటే అట్ల జరుగుతది. నన్ను నమ్ముకున్నోళ్లను తాత్కాలికంగా ఇబ్బంది పెట్టి, మీరు రాక్షస ఆనందం పొందొచ్చు. కానీ ప్రజల దీవెనలతో రాబోయే కురుక్షేత్రంలో నేను నిలబెట్టే అభ్యర్థులందరూ గెలిచి తీరుతారు. నేను ఏ తప్పూ చేయలేదు. నన్నెవరూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వెనకడుగు వేయను. కార్యకర్తలను కాపాడుకోవడానికి పోరాడతాను. నేను ఒంటరివాణ్ని కాదు.. నా వెనక లక్షలాది మంది ఉన్నారు. ఈ లక్షలాది మంది తుఫానులో మీరు కొట్టుకుపోవడం తథ్యం” అని హెచ్చరించారు.
అవమానాలే ఎదురైనయ్..
బీఆర్ఎస్ లో అవమానాలే ఎదురయ్యాయని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి బీఆర్ఎస్లో చేరాను. నాతో పాటు వందల మంది ప్రజా ప్రతినిధులు, వేల మంది నాయకులు చేరారు. కానీ నాకు, నాతో చేరినోళ్లకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదు. చివరకు ఎవరో చేతగాక ఓడిపోతే, నేనే ఓడించానని నాపై నింద మోపారు. ఆ కారణం చూపి టికెట్ ఇవ్వలేదు. నామినేషన్ ఆఖరి రోజే పార్టీలో చేరిన వ్యక్తికి బీఫామ్ ఇచ్చారు. తర్వాత కేసీఆర్ నన్ను పిలిచి మాట్లాడారు. జరిగిందేదో జరిగింది.. అండగా ఉంటామనిమాటిచ్చి, ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఊరూరా తిరిగి ఆయనను గెలిపించుకున్నాం. కానీ మళ్లీ ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు. ఇన్నేండ్లు నన్ను, నన్ను నమ్ముకున్నోళ్లను ఇబ్బంది పెట్టారు” అని మండిపడ్డారు. ‘‘చివరకు ఎవరైనా అభిమానులు శుభకార్యాలకు పిలిస్తే నేను వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దానిపై నా అభిమానులు ప్రశ్నిస్తే, ఆ మాటలను వక్రీకరిస్తున్నారు. ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుంది. నా ఆవేదన చెప్పుకునే అవకాశం ఎప్పుడైనా ఇచ్చారా?” అని కేసీఆర్ ను ప్రశ్నించారు.