ఇండ్ల పేరుతో కేసీఆర్ పేదలను మోసం చేశారు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

 ఇండ్ల పేరుతో కేసీఆర్ పేదలను మోసం చేశారు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

పెనుబల్లి, వెలుగు : తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి రావడానికి కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో అంకెల గారడీ చేసి పేదలను మోసం చేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్​ మట్టా రాగమయి, ఎంపీ రఘరామరెడ్డితో కలిసి 157 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004 నుంచి 2014 వరకు ఇందిరమ్మ ప్రభుత్వంలో 24 లక్షల ఇండ్లు నిర్మిస్తే, తెలంగాణ సాధించుకున్నాక కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో పేదలను మోసం చేశాడు కానీ.. ఇండ్లు ఇవ్వాలేదన్నారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వచ్చాక మొదటి ఏడాదే 4 లక్షల ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని, వచ్చే నాలుగేండ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు ఇవ్వనున్నామని తెలిపారు.

భూ భారతి ద్వారా రాష్ట్రం లో 2 కోట్ల 76 లక్షల ఎకరాలకు స్వదేశి సంస్థ ద్వారా హక్కులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు, కల్లూరు ఆర్డీవో రాజేందర్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు. 

రాజకీయాలకతీతంగా ఇండ్లు ఇస్తాం

ములకలపల్లి/అశ్వారావుపేట/తల్లాడ : రాజకీయాలకతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. ములకలపల్లి మండలం కొత్తూరు గ్రామ శివారు వీకే రామవరం వద్ద రూ 1.60 కోట్లతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి, పంచాయతీరాజ్ నిధుల నుంచి రూ.3.60 కోట్లతో చేపట్టనున్న అశ్వారావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామంలో హై లెవెల్ వంతెన పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పూసుగూడెం సీతారామ ప్రాజెక్టు గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు.

సంక్రాంతి తర్వాత ఇండ్ల నిర్మాణాలకు ముగ్గులు పోస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తమకు సలహాలు, సూచనలు ఇస్తారనుకున్న ప్రతిపక్ష నేత మొహం చాటేసి మీడియా ముందు అర్థరహిత ఆరోపణలు చేయడం సరైనది కాదన్నారు. తల్లాడ మండల పరిధిలోని అంబేద్కర్ నగర్ గ్రామంలో రూ.2 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డును పనపాక వరకు రెండు కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు.

పలు కార్యక్రమాలకు హాజరు.. 

కల్లూరు : కల్లూరు మండల పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన పొంగులేటి రాజేందర్ రెడ్డి-ధనలక్ష్మి దంపతుల కుమార్తె మానస నిశ్చితార్థ వేడుకలకు మంత్రి పొంగులేటి హాజరయ్యారు. నారాయణపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి సతీమణి, గ్రామ మాజీ సర్పంచ్ అంకిరెడ్డి కనకదుర్గ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారి స్వగృహంలో మంత్రి కలిసి పరామర్శించారు.

అంతకుముందు మంత్రి తన రాయణపురంలోని తన స్వగృహంలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.