ఇందిరమ్మ రాజ్యం రావడం ఖాయం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం రూరల్, వెలుగు : తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని, డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ లీడర్​ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని​ పార్టీ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లోని పలు పార్టీల నుంచి 500కు పైగా కుటుంబాలు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

సీపీఐ మద్దతు కోరిన పొంగులేటి

కాంగ్రెస్, సీపీఐ పార్టీల నిర్ణయం మేరకు కలిసి నడుద్దామని, మాయల మరాఠీగా పేరొందిన కేసీఆర్​ను ఓడిద్దామని పొంగులేటి పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. సీపీఐ పాలేరు నియోజకవర్గ సమావేశం మంగళవారం ఖమ్మం సిటీలోని పార్టీకార్యాలయంలో జరుగుతుండగా అదే సమయంలో అక్కడికి పొంగులేటి చేరుకుని మద్దతు కోరారు. కేసీఆర్ ధనబలంతో ముందుకొస్తున్నారని, దానిని ఎదురించాలన్నారు. 

చందాలకు.. దందాలకు చెక్ పడనుంది.. 

ఇల్లెందు : ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్​ అభ్యర్థి కోరం కనకయ్య గెలుపుతో చందాలకు, దందాలకు చెక్ పడనున్నదని పొంగులేటి అన్నారు. మంగళవారం మండలంలోని రాఘబోయినగూడెం గ్రామంలోని బీఆర్ఎస్​తోపాటు ఇతర పార్టీల నుంచి ఆయన సమక్షంలో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోరం కనకయ్య గెలిస్తే ఒక ఎమ్మెల్యేనేనని, అదే అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తే ఇద్దరు ఎమ్మెల్యేలని, ఎవరు కావాలో ఇల్లెందు ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.

గత ఐదేళ్ల కాలంలో షాడో ఎమ్మెల్యేగా అన్ని వర్గాల వారిని ఇబ్బందులకు గురి చేసి వందల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఇలాంటి దోపిడీ దారులకు చెక్​ పెట్టాలంటే కనకయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.