బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో పడేయడం కాంగ్రెస్ కు మాత్రమే సాధ్యమన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. యావత్ దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని చెప్పారు. 2023 జూలై 02 ఆదివారం రోజున ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న జనగర్జన బహిరంగ సభలో పొంగులేటి రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
అనంతరం పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. మాయమాటలు చెప్పి కేసీఆర్ రెండుసార్లు అధికారంలోకి వచ్చారన్న పొంగులేటి.. కేసీఆర్ హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాని చెప్పారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీనే.. కానీ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ మాత్రం రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. 2014,18 ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదని తెలిపారు.
రైతు రుణమాఫీ ఇప్పటివరకు కేసీఆర్ క్లియర్ చేయలేదని పొంగులేటి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు డిక్లరేషన్ లో చెప్పినవన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ను ఇంటికి పంపించడమే కాంగ్రెస్ ముందున్న ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చిన తనకు అండగా నిలిచిన కార్యకర్తలందరికీ పొంగులేటి ధన్యవాదాలు తెలిపారు.