తెలంగాణ లొ వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమే : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం, వెలుగు :  తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని, భద్రాద్రి అభివృద్ధికి తామే భరోసా ఇస్తున్నామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాచలం రామాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వారు చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలంలలో రోడ్​ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంతం అభివృద్ధికి తాము ఎప్పుడూ ముందుంటామన్నారు.

తమ హయాంలో నిర్మించిన  బ్రిడ్జిలు, తాలిపేరు ప్రాజెక్టు ఆధునీకరణ పనులు, విద్యుత్​ సౌకర్యం, కరకట్టల నిర్మాణాలను వివరించారు. రాముడినే మోసం చేసిన ఘనుడు సీఎం కేసీఆర్​ అన్నారు. రాష్ట్రంలో పదేళ్ల కాలంలో ఆయన కుటుంబంలో తప్ప ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం రాలేదన్నారు. మరోసారి పొదెం వీరయ్యను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. 

.కేసీఆర్​రూ.వంద కోట్లు పంపించిండు

కాంగ్రెస్​, టీజేఎస్​ మద్ధతుతో కొత్తగూడెంలో సీపీఐ తరుపున పోటీ చేస్తున్న కూనంనేని సాంబశివరావును ఓడించేందుకు కేసీఆర్​ కొత్తగూడెం నియోజకవర్గానికి రూ. వంద కోట్లు పంపించారని పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆరోపించారు. కూనంనేనిని గెలిపించాలని సీపీఐ, కాంగ్రెస్​ ఆధ్వర్యంలో కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్​లో మంగళవారం నిర్వహించిన రోడ్​ షోలో కూనంనేని, తుమ్మలతో కలిసి ఆయన మాట్లాడారు.

ALSO READ : ముంపు గ్రామాల సమస్యలను పట్టించుకోలేదు : మేడిపల్లి సత్యం

అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనేందుకు కేసీఆర్​ పన్నుతున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్​ మిత్రపక్షాల సునామీలో బీఆర్ఎస్​ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. కూనంనేనిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలదేనన్నారు. సీపీఐ, కాంగ్రెస్​ నేతలు సాబీర్​ పాషా, నాగ సీతారాములు, ఆళ్ల మురళి, నాగేంద్రత్రివేది పాల్గొన్నారు.