ఖమ్మం రూరల్, వెలుగు : తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే ధనికరాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, ఇక మూడోసారి సీఎం అయితే ప్రజలకు బూడిదే మిగులుతుందని కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014కు ముందు కల్వకుంట్ల కుటుంబం ఆర్థిక పరిస్థితి ఏమిటి..
ఇప్పుడు లక్ష కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతంగా కట్టామని గప్పాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఇప్పటికైనా దొరల పరిపాలన కావాలో.. ప్రజల పరిపాలన కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు.
కోట్టు ఖర్చు పెట్టినా గెలిచేది కాంగ్రెస్సే..
నేలకొండపల్లి/కూసుమంచి/కల్లూరు, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రూ.కోట్లు ఖర్చుపెట్టినా గెలిచేచది కాంగ్రెస్సేనని, సర్వే లన్ని హస్తానికే అనుకూలమని చెబుతున్నాయని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్టీ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో బూత్ లెవల్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసారి బీఆర్ఎస్ 20 నుంచి 25 సీట్లు గెలువడమే కష్టంగా ఉందన్నారు. అధికార పార్టీ నాయకుల అహంకారానికి కాంగ్రెస్ కార్యకర్తలు పుల్‌స్టాప్ పెట్టే సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.
ఆలయాల్లో పూజలు
పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు కల్లూరు మండల పరిధిలోని నారాయణపురం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, తన అభిమానులతో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం బయలుదేరారు. తొలుత పొంగులేటి స్వగ్రామం నారాయణ పురం, కల్లూరు ఎన్ఎస్పీ క్రాస్ రోడ్‌లోని పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. తన స్వగృహంలో తన తల్లి పొంగులేటి స్వరాజ్యమ్మ పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. తండ్రి దివంగత పొంగులేటి రాఘవ రెడ్డి స్మృతి వనం వద్దకు చేరుకొని సమాధి వద్ద ఘన నివాళులర్పించారు.
పొంగులేటి తరఫున తన సోదరుడు ప్రసాద్ రెడ్డి పాలేరులో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. 9న ఆయనే స్వయంగా పాలేరు ఎన్నికల కార్యాలయానికి వచ్చి తన నామినేషన్ దాఖలు చేస్తారని ప్రసాద్‌రెడ్డి విలేకరులతో తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల బీఆర్ఎస్ ను వీడిన వెంపటి రవి, వడ్లకుండ భుజంగరావుతో పాటు పలువురు శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.