పేదలందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాదే : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

పేదలందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాదే : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం రూరల్/కూసుమంచి, వెలుగు : రాబోయే మూడు సంవత్సరాల్లో నియోజకవర్గంలోని అర్హులైన పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత తనదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్, కుసుమంచి మండలాల్లోని పలు గ్రామాల్లో ఆయన ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేళ్లలో బీఆర్ఎస్​ ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వనుందని తెలిపారు. లింక్ రోడ్లన్నీ పూర్తి చేయిస్తామని చెప్పారు.

ఏడాది లోపు పాలేరు నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. పోరాడి సాదించుకున్న రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరగలేదని అందుకే ఇందిరమ్మ రాజ్యం రావాలని పేదవారి ప్రభుత్వం తెచ్చుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో రైతును రాజు చేయాలనే సంకల్పంతో రాబోయే రెండు నెలల్లోనే రూ.31 వేల కోట్ల  రుణమాఫీ చేయబోతున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయి కొట్టుకు పోయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టాల్సి వస్తోందని తెలిపారు.

పలు గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. పలు సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రభుత్వం ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ ప్రకటించినందున ఆరెంపుల గ్రామంలో కాంగ్రెస్​ నాయకులు బండి జగదీశ్​ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటికి క్షీరాభిషేకం, పూలాభిషేకం చేశారు. కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్​ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్​ పార్టీ మండలాధ్యక్షుడు కల్లెం వెంకటరెడ్డి, ఎంపీపీ బానోతు శ్రీనివాస్​నాయక్, ఆరెంపుల మాజీ సర్పంచ్​రవి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.