జేఎన్టీయూ కాలేజీ మద్దులపల్లిలోనే : పొంగులేటి శ్రీనివాస రెడ్డి

  • ఇప్పటికే అక్కడ 30 ఎకరాలు కేటాయింపు
  • ఇంకా ఎక్కువ ప్లేస్​ కోసం ఆఫీసర్ల వెతుకులాట
  • ప్రత్యామ్నాయం లేక పాత ప్లేస్​కే మొగ్గు?

ఖమ్మం/ ఖమ్మం రూరల్, వెలుగు : గతేడాది పాలేరు నియోజకవర్గానికి మంజురైన ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీకి మద్దులపల్లిలోని స్థలమే ఫైనల్​ అయ్యే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్​ మండలంలో మరింత మెరుగైన స్థలం కోసం రెవెన్యూ అధికారులు వెతికినా, అంత పెద్ద విస్తీర్ణం లో స్థలాలు అందుబాటులో లేవు.

దీంతో ప్రస్తుతం నర్సింగ్ కాలేజీ నిర్మాణం జరుపుకుంటున్న స్థలం పక్కనే, ఇంజినీరింగ్ కాలేజీ కోసం స్థలాన్ని కేటాయించారు. అయితే సర్వే నంబర్​ 71లో 70 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, ప్రస్తుతం 30 ఎకరాలు రెవెన్యూ అధికారులు సర్వే చేసి కేటాయించారు. మిగతా స్థలంలోని కొంత భాగంలో రెండు గ్రానైట్​ క్వారీల లీజ్​ నడుస్తుండగా, మరికొంత స్థలంలో అసైన్డ్ పట్టాలిచ్చి క్యాన్సిల్ చేశారు. భూ కేటాయింపునకు సంబంధించిన ఫైల్​ను ఇప్పటికే జేఎన్టీయూకి పంపించారు. జేఎన్టీయూ వైస్ చాన్సలర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. 

మంత్రి పరిశీలన..

ఈనెల మొదటివారంలో మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ తో పాటు జేఎన్టీయూ కళాశాలకు కేటాయించి స్థలాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంతకంటే పెద్దది, అనుకూలమైన స్థలం పాలేరు నియోజకవర్గంలో ఎక్కడైనా ఉంటే చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు పలు చోట్ల పరిశీలించినా ఎక్కడా అనువైన, విశాలమైన స్థలం లేకపోవడంతో మంత్రి పొంగులేటికి సమాచారమిచ్చారు. అదనంగా కావాలంటే ఇప్పుడు కేటాయించిన స్థలాన్ని ఆనుకోని మరో 20 ఎకరాలకు పైగా స్థలాన్ని ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు. జేఎన్టీయూ అధికారుల నుంచి తుది నిర్ణయం వచ్చిన తరువాత కళాశాలకు సంబంధించిన నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

300 సీట్లతో..

గతేడాది ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం ఇంజినీరింగ్ కాలేజీని మంజూరు చేసింది. కంప్యూటర్​ సైన్స్​ ఇంజినీరింగ్, సీఎస్​ఈ డేటాసైన్స్​, ఈసీసీ, ఈఈఈ, మెకానికల్ విభాగాల్లో 60 సీట్ల చొప్పున మొత్తం 300 సీట్లతో జేఎన్​టీయూ కాలేజీని కేటాయించింది. ఈ విద్యాసంవత్సరంలోనే తరగతులు ప్రారంభమయ్యాయి. మద్దులపల్లిలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉన్న వైటీసీ బిల్డింగ్ లో తాత్కాలిక పద్ధతిలో జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు చేసి క్లాసులు నడిపిస్తున్నారు. ఇక్కడ కంపూటర్ (సీఎస్సీ)గ్రూపులో 41 మంది, డేటా సైన్స్ విభాగంలో 8 మంది విద్యార్థులు ఉన్నారు.

కళాశాలలో ప్రిన్సిపాల్ తో పాటు ఏడుగురు ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. ప్రిన్సిపాల్ ఒక్కరు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగి కాగా, మిగతా ప్రొఫెసర్లు కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు. మరోవైపు జేఎన్​టీయూ సిబ్బంది, విద్యార్థులు మాట్లాడుతూ మద్దులపల్లిలో వైటీసీ బిల్డింగ్​లో  నిర్వహిస్తున్న జేఎన్టీయూ కళాశాల అన్ని రకాలుగా తమకు అనుకూలంగా ఉందని చెబుతున్నారు. అదేవిధంగా జేఎన్టీయూ కళాశాల కోసం కేటాయించిన స్థలం కూడా ఖమ్మం సిటీ నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉండడం కూడా సౌకర్యవంతంగా బాగుందని అభిప్రాయ పడుతున్నారు.