ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై అక్రమ కేసులు, పీడీ యాక్ట్ లు పెట్టడం వల్ల బీఆర్ఎస్ నాయకులకు 10 వేల ఓట్లు వ్యతిరేకంగా పడుతాయని మాజీ ఎంపీ, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం టౌన్ లోని 54వ డివిజన్ లో సమీకృత మార్కెట్ రోడ్డు వెడల్పు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై సుమారు 6 గంటల పాటు బైఠాయించి.. నిరసన తెలిపారు. 54వ డివిజన్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్ కు సంఘీభావంగా రోడ్డుపై బైఠాయించారు.
ఖమ్మం కార్పొరేషన్ లో అక్రమంగా దోచుకుని దాచుకున్న సొమ్మును, కబ్జా చేసిన ప్రభుత్వ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్కిస్తామని హెచ్చరించారు పొంగులేటి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన బినామీ కాంట్రాక్టర్లను పెంచి పోషిస్తూ.. రానున్న ఎన్నికల్లో 3వసారి గెలవాలన్న తపనతో ఉన్నారంటూ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.
అధికార పార్టీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు ప్రతి చోట ఇదే విధంగా నిరసన తెలపాలని.. అప్పుడే ఏకపక్ష ధోరణితో వ్యవహరించరని చెప్పారు. కొద్ది రోజుల్లో ప్రభుత్వం మారబోతోందన్నారు. ఎంత శాంతియుతంగా నిరసన తెలిపినా అధికార పార్టీ నాయకులు స్పందించరని అన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చికా మెరుగైన రోడ్లు వేస్తామని చెప్పి.. ఆందోళనను విరమింపజేశారు.