రాష్ట్రంలో గెలిచేది కాంగ్రెస్సే : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

  • పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

ఖమ్మం రూరల్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 70 నుంచి 78 సీట్లు గెలవబోతోందని ఆ పార్టీ పాలేరు నియోజవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్నికల సమయం ఇంకా 23 రోజులు ఉందని,  కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం సిటీలో ఎస్​ఆర్​ కన్వెన్షన్ సెంటర్​లో నిర్వహించిన పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ మండలం బూత్ కమిటీల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.

పార్టీ కార్యకర్తలు బెదిరింపులకు భయపడొద్దని చెప్పారు. ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేని వ్యక్తిని కాంగ్రెస్​ కార్యకర్తలు, నాయకులు శక్తి యుక్తులతో పాలేరు ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. ఆనాడు గెలిపించిన వ్యక్తి పార్టీలో నుంచి బయటకు పోయి ఇప్పుడు ఆయన అనుచరులతో కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు.

గతంలో చేసిన తప్పును మళ్లీ పునరావృతం చేయొద్దని, కార్యకర్తలకు  ఎలాంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం మాజీ మంత్రి, ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్​ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒకప్పుడు కరువుతో అల్లాడిన పాలేరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దానన్నారు.

అంత అభివృద్ధి చేసిన తనను కొంత మంది దుర్మార్గులు పార్టీకి వెన్నుపోటు పొడిచి ఓడించారని చెప్పారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు కష్టపడి గెలిపించిన ఎమ్మెల్యే  కేసీఆర్ కు అమ్ముడుపోయి పార్టీకి ద్రోహం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తోందన్నారు. తమ్మినేని కృష్ణయ్య ఆశయాలు సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాయల నాగేశ్వరరావు, మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, రాంరెడ్డి చరణ్ రెడ్డి, మానుకొండ రాధ కిషోర్, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కళ్లెం వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. 

కాంగ్రెస్ లో  చేరికలు

కూసుమంచి, వెలుగు :  తిరుమలాయపాలెం మండలంలోని బీరోలు, బంధంపల్లి గ్రామాలకు చెందిన బీఆర్​ఎస్​ ముఖ్యనాయకులు ఎస్.కె. జాన్ బాబు, పయ్యా మల్లయ్య, చాగంటి వెంకన్న, ఉపేందర్ సహా 300కు పైగా కుటుంబాలు ఆదివారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరాయి. దీంతో ఆ రెండు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోయింది.  తిరుమలాయపాలెం మండలంలో పిండిప్రోలు గ్రామానికి చెందిన  వివిధ పార్టీల 20 కుటుంబాల వారు కాంగ్రెస్ జిల్లా నాయకుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్  కండువా కప్పుకున్నాయి.