- రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు
- గిరిజనులు, దళితులకు ఇంటికి రూ.6లక్షలు..
- మిగిలిన వారికి రూ.5లక్షలు
- సీఎం రేవంత్‌రెడ్డి భద్రాచలం పర్యటనను సక్సెస్ చేయాలి
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భద్రాచలం, వెలుగు: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఐదోది ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని భద్రాద్రి రామయ్య సన్నిధిలో సోమవారం ప్రారంభిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, ప్రసారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పథకాన్ని ప్రారంభించేందుకు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను సక్సెస్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భద్రాచలం మార్కెట్ యార్డులో సభా స్థలాన్ని ఆయన ఆదివారం సాయంత్రం పరిశీలించారు.
ఏర్పాట్లపై కలెక్టర్ ప్రియాంక అలతో సమీక్షించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దేశంలోనే అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దని గుర్తు చేశారు. తొలి విడత నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షల ఇళ్లు పేదలకు ఇవ్వాలనేది తమ లక్ష్యమని తెలిపారు. గిరిజన, దళితులకు ఇంటికి రూ.6లక్షలు, ఇతరులకు రూ.5లక్షలు చొప్పున ఇంటికి ఇస్తామని చెప్పారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. తొలి విడతలో ఇంటిస్థలం ఉన్నవారికి, రెండో విడతలో స్థలం లేని వారికి మంజూరు చేస్తామని చెప్పారు.
గతంలో బీఆర్ఎస్ పాలనలో నాటి సీఎం కేసీఆర్ బొమ్మను చూపించి మాయ చేశారని ఎద్దేవా చేశారు. తాము మూడు నెలల్లోనే ప్రజలు కోరుకున్న పాలనను అందిస్తున్నామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ పోరిక బలరాం నాయక్, జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్, కలెక్టర్ ప్రియాంక అల, ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొన్నారు.
ఎన్ని నిధులైనా ఇస్తాం
రామాలయం అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఆర్డీవో ఆఫీసులో ఎండోమెంట్కమిషనర్, ఈవో, ఇరిగేషన్ ఇంజినీర్లతో కలిసి రామాలయం అభివృద్ధి, కరకట్టలు, గోదావరి నివారణ చర్యలపై రివ్యూ చేశారు. సీఎంతో చర్చించాల్సిన అంశాలపై రెండు శాఖల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి ఏం కావాలి, వాటికి ఎంత భూమి సేకరించాలని అడిగారు.
మాడవీధులు, ప్రాకార మండపాలు, గతంలో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలకు నిధుల ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం అన్నారు. ఆంధ్రాలో విలీనమైన ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో దేవస్థానంకు సంబంధించిన 1000 ఎకరాల భూమి అన్యాక్రాంతం కావడంపై దేవస్థానం ఈవో రమాదేవి, సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గోదావరి వరదల నివారణ చర్యల కోసం చేపట్టాల్సిన అంశాలను ఇరిగేషన్ ఇంజినీర్లతో చర్చించారు. గత ప్రభుత్వం కరకట్టల నిర్మాణానికి తయారు చేసిన మాస్టర్ ప్లాన్ గురించి ఆరా తీశారు. సీఎం రేవంత్‌రెడ్డితో జరిగే రివ్యూ మీటింగ్‌లో రామాలయం, ఇరిగేషన్ శాఖలు చేపట్టే పవర్ పాయింట్ ప్రజంటేషన్ పరిశీలించారు.
సీఎం పర్యటన ఇలా..
భద్రాద్రికొత్తగూడెం: సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 12 గంటల తర్వాత భద్రాచలంలోని సీతారామచంద్రస్వామిని దర్శించుకోనున్నారు. అక్కడే వ్యవసాయ మార్కెట్‌యార్డ్2 గంటల వరకు జరిగే ప్రోగ్రాంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీంను ప్రారంభిస్తారు. అనంతరం ఇరిగేషన్, టెంపుల్ డెవలప్మెంట్పై ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు. అక్కడి ఉంచి సాయంత్రం 4 గంటల వరకు మణుగూరు చేరుకొని అక్కడ పొలిటికల్ బహిరంగ సభలో పాల్గొంటారు. పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేస్తున్నారు.
మణుగూరులో సభా వేదిక పరిశీలన
మణుగూరు: మణుగూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభా స్థలంలో జరుగుతున్న పనులను, హెలిపాడ్ ను మంత్రి పొంగులేటి పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే ఈ సభ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఆయన వెంట పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, డీసీసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ ఉన్నారు.