ఖమ్మం రూరల్/కుసుమంచి, వెలుగు : పాలేరు ప్రజలు ఒక ఎమ్మెల్యేను ఎన్నుకుంటే ఇప్పుడు నలుగురు షాడో ఎమ్మెల్యేలు పెత్తనం చెలాయిస్తున్నారని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రూరల్ మండలంలో ఓ షాడో ఎమ్మెల్యే ఉన్నారని, అతడు చేసే దౌర్జన్యాలు, కబ్జాలు లెక్కలేనన్ని ఉన్నాయని, ఐదేళ్లుగా జరిగిన అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పబోతున్నారన్నారు. ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్లో మా కాంప్లెక్స్‌లో సాధిక్ అలీ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం పొంగులేటి మాట్లాడారు.
ఎప్పుడో హైదరాబాద్‌లో సెటిలై బాగా డబ్బులు సంపాదించి 2018 ఎన్నికలకు 15 రోజులు ముందు వచ్చి కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన పాలేరు ఎమ్మెల్యే స్థానికులు, స్థానికేతరులు అని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని ఇచ్చిన సెక్యులర్ పార్టీకి ప్రజలంతా మద్దతు తెలపాలని కోరారు. అనంతరం భగత్ వీడు తండా బీఆర్ఎస్ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీతో పాటు 100 కుటుంబాలు, కుసుమంచి మండలంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పొంగులేటి సమక్షంలో పార్టీలో చేరాయి.