ఖమ్మం, వెలుగు: గడప గడపకూ కాంగ్రెస్ పేరుతో అన్ని గ్రామాల్లోని ప్రజలకు ఆరు గ్యారంటీల గురించి వివరించాలని కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. పొంగులేటి క్యాంపు కార్యాలయంలో పినపాక నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ హస్తం పార్టీతోనే సంక్షేమం సాధ్యమమనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి గడపకూ కచ్చితంగా తిరగాలని సూచించారు.
నియోజకవర్గ అభ్యర్థి ఎవరైనా గెలుపు ముఖ్యమన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషిచేయాలన్నారు. అధికారంలోకి వచ్చాక కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తించి భవిష్యత్తులో గుర్తింపును ఇస్తుందని, ఇందుకు తాను భరోసాగా ఉంటానని నాయకులకు హామీ ఇచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్, తుళ్లూరి బ్రహ్మయ్య, పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.