ఇందిరమ్మ ఇండ్లకు అర్హులను ఎంపిక చేయాలి : పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఇందిరమ్మ ఇండ్లకు అర్హులను ఎంపిక చేయాలి : పొంగులేటి శ్రీనివాస రెడ్డి
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

కూసుమంచి/ఖమ్మం రూరల్/నేలకొండపల్లి,​ వెలుగు :  ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులైన నిరుపేదలనే ఎంపిక చేయాలని, అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం కూసుమంచిలో మంత్రి క్యాంప్ ఆఫీస్​లో స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ డాక్టర్​పి. శ్రీజతో కలిసి ఖమ్మం రూరల్ మండలంలో ఉన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను ఆయా గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు పూర్తవుతున్న నేపథ్యంలో నెలాఖరు నాటికి గ్రామాల వారీగా మంజూరు చేయాల్సిన ఇండ్ల జాబితా వస్తుందన్నారు. మొదటి దశలో నిరుపేదలను పార్టీలకతీతంగా ఎంపిక చేయాలని సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పైలట్ ప్రాజెక్టు పూర్తయిందని, నాలుగు, ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇచ్చేందుకు మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పారు.  ఫ్యామిలీ డిజిటల్ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందవచ్చన్నారు. జనవరి ఒకటి నుంచి రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తుందని చెప్పారు.

 పెండింగ్​లో ఉన్న రైతు రుణమాఫీ రూ.13 వేల కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తామని చెప్పారు. మండలంలో ప్రజలకు అవసరాల మేరకు అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు స్థలం గుర్తించాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా చేసే అవకాశం ఉన్న చోట నీరు సరఫరా చేయాలని చెప్పారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా శ్మశానవాటికలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ముత్తగూడెం విద్యార్థుల సౌకర్యం కోసం ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించాలన్నారు. పల్లెగూడెం నుంచి ఎంవీ పాలెం వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఖమ్మం ఆర్డీవో గణేశ్, పీఆర్ ఈఈ వెంకట్ రెడ్డి, మండల విద్యాధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ సురేశ్, ప్రజాప్రతినిధులు, అధికారులు 
పాల్గొన్నారు.

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ 

నేలకొండపల్లి మండల కేంద్రంలోని భక్త రామదాసు ధ్యాన మందిరం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ శ్రీజతో కలిసి మంత్రి పొంగులేటి కాటమయ్య రక్షక కవచం భద్రత కిట్లను, కల్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.  మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలకు మంచి జరగాలంటే ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో 8 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు పీఎస్​ఆర్​ ట్రస్ట్ ఆధ్వర్యంలో 620 సైకిళ్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 

నాణ్యతలో రాజీ పడొద్దు....

అభివృద్ధి పనులను నాణ్యతతో, అగ్రిమెంట్ సమయంలోగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్ రామన్నపేట ఎస్సీ కాలనీలో ఎస్డీఆర్ఎఫ్ నిధులు రూ. 25 లక్షలతో చేపట్టిన కాల్వ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.