కాంగ్రెస్ కమర్షియల్ గా మారింది:మోడీతో భేటీ తర్వాత పొంగులేటి

పార్టీని నమ్ముకుని పనిచేసేవారికి కాంగ్రెస్ లో విలువ లేదని.. అందుకే కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రకటించారు పొంగులేటి సుదాకర్ రెడ్డి. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం తరువాత పొంగులేటి మీడియాతో మాట్లాడారు. బలమైన నాయకత్వంలో పని చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీ లో చేరుతున్నట్టు ఆయన తెలిపారు. రేపు అధికారికంగా బీజేపీలో చేరుతున్నా అని చెప్పారు పొంగులేటి.

కాంగ్రెస్ లో తనకు అవమానాలు జరిగాయని పొంగులేటి సుధాకర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కమర్షియల్ గా మారిపోయిందని పని చేసేవారికి గుర్తింపులేకుండా పోయిందని అన్నారు. తాను పార్టీకి చేసిన పనిలో 20% మాత్రం ఫలితమే దక్కిందని అన్నారు పొంగులేటి. దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని అన్నారు. బాలా కోట్ లో ఉగ్రవాద శిబిరాలపై సైనికులు దాడులు చేస్తే సాక్ష్యాలున్నాయని అడగడం సిగ్గుచేటని చెప్పారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా.. అదే నాయకత్వానికి మళ్లీ  లోక్ సభ బాధ్యతలు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అప్పగించారని విమర్శించారు పొంగులేటి. ఎటువంటి షరతులు లేకుండా స్వచ్ఛందంగా బీజేపీలో చేరుతున్నట్టు తెలిపారు. 1993 నుంచి తనకు మోడీతో పరిచయం ఉందని.. వీరి నాయకత్వంలో దేశం మరింత ముందుకు వెళ్తుందని అన్నారు పొంగులేటి సుధాకర్ రెడ్డి.