రూ.950కోట్ల కేంద్ర నిధులను ఖర్చు చేయండి : పొంగులేటి సుధాకర్​రెడ్డి

  •     పునరావాస కేంద్రాల్లో భోజనం కూడా పెట్టలేరా?
  •     బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పొంగులేటి సుధాకర్​రెడ్డి

భద్రాచలం, వెలుగు : వరదల్లో చిక్కుకుని పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు సరైన భోజనం కూడా పెట్టలేని స్థితిలో తెలంగాణ సర్కారు ఉందా? అంటూ బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు పొంగులేటి సుధాకర్​రెడ్డి ఫైరయ్యారు. ఆయన ఆదివారం భద్రాచలంలోని గోదావరి ముంపు ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రమిచ్చిన రూ.950 కోట్ల ఎన్డీఆర్ఎఫ్​ నిధులు ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. నిధులుండి బాధితులను పస్తులుంచుతారా.? అని నిలదీశారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన అందరినీ ఆదుకోవాలన్నారు. ఈయన వెంట రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్​రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రంరాజు బెహరా తదితరులు ఉన్నారు.

కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం...

బూర్గంపహాడ్ : గోదావరి వరదలతో జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం బూర్గంపహాడ్ లోని వరదలతో దెబ్బతిన్న పంటలు, హైవేలతోపాటు పునరావాస కేంద్రాన్ని వారు పరిశీలించారు.

మానవీయ కోణంలో స్పందించాలి..

ఖమ్మం కార్పొరేషన్ : వరద బాధితుల పట్ల మానవీయకోణంతో అధికార యంత్రాంగం స్పందించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి కోరారు. ఖమ్మం జిల్లాలో పార్టీ లీడర్లతో ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వెంటనే బాధితులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, ఉప్పల శారద, ప్రధాన కార్యదర్శి రుద్ర ప్రదీప్, నున్నా రవి, చిలుకూరి రమేశ్, అల్లిక అంజయ్య, లక్ష్మీనారాయణ, అంకటి పాపారావు, దార్ల శంకర్ జంగిలి రమణ, జ్వాలా నరసింహారావు, అనిత, రవీందర్ కుమార్ 
ఉన్నారు.