హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ఆ పార్టీ తమిళనాడు కో ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే నెల 1న మహబూబ్ నగర్, 3న నిజామాబాద్ కు ప్రధాని మోదీ వస్తుండడంతో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు వణుకు పుడుతున్నదని గురువారం ఆయన హైదరాబాద్ లో ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి రాష్ట్రంలో మోదీ, అమిత్ షా, నడ్డా వంటి బీజేపీ అగ్రనేతలు విస్తృతంగా పర్యటించనున్నారని ఆయన తెలిపారు. వారి సభలతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోనున్నాయని స్పష్టం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారాన్ని ఏలుతున్న బీఆర్ఎస్ ఇక్కడి ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, వారి స్వప్రయోజనాలకే పెద్దపీట వేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనను చూశారని, ఇప్పుడు బీజేపీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. దేశంలో మోదీ పాలన.. రాష్ట్రంలో రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణలో మోదీ సభలను విజయవంతం చేయాలని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు.