నకిరేకల్, ( వెలుగు): ప్రజలు మాయల ఫకీరు మాటలు చెప్పే కేసీఆర్‌ను నమ్మి మోసపోవద్దని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న ఆయన శనివారం సాయంత్రం నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని బైపాస్ వద్ద కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పొంగులేటికి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆయన హోటల్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ మోసపు మాటలు, డబ్బు మూటలతో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. అయినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. తొమ్మిదిన్నరేండ్లుగా అన్నివర్గాలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న కల్వకుంట్ల కుటుంబాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఆరు గ్యారెంటీ స్కీమ్‌లు కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
పార్టీ ఉమ్మడి నల్గొండలోని12 అసెంబ్లీ స్థానాలు, ఖమ్మం లోని 10 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, జటంగి వెంకట నరసయ్య యాదవ్, పెద్దిరెడ్డి రాజా పాల్గొన్నారు.