అసెంబ్లీ ఎలక్షన్స్ వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తన రాజీనామా లేఖను పంపారు. పార్టీలో తనకు అవమానం జరిగిందంటూ లేఖలో పేర్కొన్నారు.
పీసీసీ అధ్యక్షుడితో చాలా సార్లు మాట్లాడటానికి అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు పొన్నాల. కనీసం బయట కలిసి పలకరించినా మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ లో సామాజిక న్యాయం పాతరయ్యిందన్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచి వేశాయన్నారు.
కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ గత కొన్ని రోజులుగా పొన్నాల పోరాటం చేస్తున్నారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం, మంత్రిగా.. తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ కు తొలి పీసీసీ చీఫ్ గా చేసిన పొన్నాల కాంగ్రెస్ కు రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ALSO READ: గుడ్ న్యూస్ : ORR మల్లంపేట ఎంట్రీ, ఎగ్జిట్ ప్రారంభం
జనగామ టికెట్ విషయంలో గత కొన్ని రోజులుగా పొన్నాల అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి జనగామ టికెట్ ఇస్తారని ప్రచారం ఉంది. దీంతో మనస్తాపానికి గురైన పొన్నాల కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.