
- అవమానం భరించలేకే పార్టీ మారిన
- కాళేశ్వరంపై మీడియా ముఖంగా స్పందించను
జనగామ, వెలుగు : కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని బీఆర్‌ఎస్ లీడర్ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న కేసీఆర్‌ను మరోసారి సీఎం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం జనగామలోని తన క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. తాను పదవు కోసం పార్టీ మారలేదని, కాంగ్రెస్‌లో అవమానాలు భరించలేకే బీఆర్‌ఎస్‌లో చేరారని చెప్పారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న తెలంగాణకు కర్ణాటక డిప్యూటీ సీఎం వచ్చి ఐదు గంటలే ఇస్తామని చెబుతుంటే జనాలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
అవగాహన లేని వారి చేతిలో కాంగ్రెస్ నాశనం అవుతోందని, దొంగ సర్వేల పేరుతో పార్టీని ఆగం చేస్తున్నారన్నారు. జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ బ్యారేజీ లోపాలపై స్పందించాలని మీడియా అడుగగా సమాధానం దాట వేశారు. కాళేశ్వరంపై మీడియా ముఖంగా స్పందించనని చెప్పారు. సమావేశంలో లీడర్లు బండా యాదగిరిరెడ్డి, ఆరిఫ్, ధర్మపురి శ్రీనివాస్, మాజీద్, అంజయ్య, గురువయ్య, షకీల్ పాల్గొన్నారు.