కరీంనగర్ సిటీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడ్డ లాయర్లకు తప్పకుండా న్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ హామీ ఇచ్చారు. గురువారం డీసీసీ ఆఫీసులో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక చట్టాలను తీసుకొస్తోందని, వాటిపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రశ్నించడం లాయర్ల హక్కు అని అన్నారు. న్యాయవాదుల వ్యవస్థలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవడం కోసం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని అన్నారు. సమావేశంలో సీనియర్ లాయర్ రాచకొండ ప్రభాకర్, లాయర్లు రూపురెడ్డి దేవేందర్ రెడ్డి, కల్లేపల్లి లక్ష్మయ్య, సంజీవరెడ్డి, సుజిత్ కుమార్, చక్రధర్, అంజనీ ప్రసాద్, నరసింహారెడ్డి, లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.