- కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రి పొన్నం
- ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కలిసి అందజేత
- మంత్రితో కలిసి లంచ్ చేసిన మాజీ సీఎం
- గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికీ ప్రభుత్వ ఆహ్వానం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ప్రజా పాలన ఏడాది వేడుకలకు రావాలని మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు శనివారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. పొన్నం ప్రభాకర్‌కు రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌కు పొన్నం ప్రభాకర్ ఆహ్వానపత్రిక అందజేశారు. మంత్రితోపాటు ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రొటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు ఉన్నారు. తనను ఆహ్వానించేందుకు వచ్చిన వారికి కేసీఆర్ లంచ్ ఏర్పాటు చేయగా.. కలిసి భోజనం చేశారు.
గవర్నర్‌కు ప్రత్యేక ఆహ్వానం
రాజ్ భవన్లో గవర్నర్ జిష్టుదేవ్ వర్మను మంత్రి పొన్నం ప్రభాకర్కలిసి, ఉత్సవాలకు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. మంత్రి వెంట ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఇతర అధికారులు ఉన్నారు. అలాగే, దిల్కుషా గెస్ట్‌హౌస్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు.