
- అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలపలేదు: పొన్నం
- ఆ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్‌ను ఓడించినయ్
- వాటి దోస్తానా మరోసారి బయటపడిందని కామెంట్
- బండి సంజయ్ ఇంకా భ్రమల్లో బతుకుతున్నారు: వెంకట్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికలతో బీజేపీ, బీఆర్ఎస్ దోస్తానా మరోసారి బయటపడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ రెండు పార్టీల ఫ్రెండ్‌షిప్‌ను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ‘‘కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే.. అభ్యర్థులను పెట్టకుండా బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కయింది. ఆ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్‌ను ఓడించాయి” అని అన్నారు. గురువారం హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్‌లో ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో రెనోవేట్ చేసిన స్టేట్ గెస్ట్ హౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి పొన్నం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్‌కు రంజాన్ గిఫ్ట్ ఇచ్చాం’ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సంజయ్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనలేమికి నిదర్శనమని పొన్నం మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లంత కూడా బీజేపీకి మెజార్టీ రాలేదని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ఓటమిపై సమీక్షించుకుంటామని తెలిపారు. బీజేపీ ఎంపీలకు దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాలని సవాల్ విసిరారు. రామగుండం నుంచి హైదరాబాద్ వరకు 8 లేన్ల హైవే నిర్మించాలని కోరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గతంలో టూరిజం మినిస్టర్‌గా ఉండి హైదరాబాద్‌కు చేసిందేంటి? అని ప్రశ్నించారు. తెలంగాణపై బీజేపీ వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో బీజేపీ ఎంపీలు ఎందుకు కృషి చేయడం లేదని ఫైర్ అయ్యారు.
గతం మర్చిపోయారా?: వెంకట్‌రెడ్డి
కేంద్రమంత్రి బండి సంజయ్ ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘ఆప్ కీ బార్.. చార్ సౌ అంటూ లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు చెప్పారు. కానీ 240 సీట్లకే పరిమితమై, ఇతర పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పారు. కానీ 8 ఎమ్మెల్యే సీట్లే గెలుచుకున్నారు. బండి సంజయ్ ఇవన్నీ మర్చిపోయి ఇంకా భ్రమల్లో బతుకుతున్నారు.
ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలవగానే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు” అని ఫైర్ అయ్యారు. బీజేపీకి లోక్‌సభ సీట్లు తగ్గితే, తమ పార్టీ 50 నుంచి 100 సీట్లకు పెరిగిందని.. వచ్చే ఎన్నికల్లో 200 దాటుతాయని చెప్పారు. తెలంగాణలో కూడా తక్కువ మెజారిటీతో కొన్ని ఎంపీ సీట్లలో ఓడిపోయామని, లేకపోతే 12 వచ్చేవని చెప్పారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా.. ‘‘ఎవరు పడితే వాళ్లు మాట్లాడే మాటలకు నేను రెస్పాండ్ అయితే నా విలువ తగ్గుతుంది.
ఆయన వ్యాఖ్యలపై క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డిని వివరణ అడగండి” అని మంత్రి అన్నారు. కాగా, గతంలో కాంగ్రెస్ హయాంలో సీఎం క్యాంప్ ఆఫీసుగా వినియోగించిన భవనాన్ని ఆధునీకరించి అన్ని సౌకర్యాలతో స్టేట్ గెస్ట్ హౌస్‌గా మార్చామని వెంకట్‌రెడ్డి తెలిపారు. ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు ప్రైవేట్ హోటల్స్‌లో ఉంచితే, రూ.లక్షల్లో ప్రజాధనం వృథా అవుతుందని.. అందుకే ఫైవ్ స్టార్ సౌలతులతో స్టేట్ గెస్ట్‌హౌస్ అందుబాటులోకి తెచ్చామన్నారు.