ఎంపీ బండి,మాజీ ఎంపీ వినోద్ కు పొన్నం సవాల్

టీబీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ   బండి సంజయ్ తో పాటు  మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు కాంగ్రెస్ నేత  పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. వారు కరీంనగర్ పార్లమెంట్ అభివృద్దికి ఏం చేశారో బహిరంగ చర్చకు రావాలన్నారు.  తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.  సోనియా గాంధీ  ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరిందో లేదో గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించుకోవాలన్నారు.

ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని శ్రీ రేణుక ఎల్లమ్మను పార్టీ శ్రేణులతో కలిసి పొన్నం ప్రభాకర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.   తెలంగాణ ప్రజల ఆకాంక్షల నెరవేర్పుకై జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దశాబ్ద కాలంలో వందేళ్లు బ్రతికేంత ఆస్తులను కేసిఆర్ కుటుంబం సంపాదించుకుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో  60 వేల కోట్ల అప్పు ఉంటే కేసీఆర్ హయాంలో  ఆరు లక్షల కోట్ల అప్పుకు చేరుకుందన్నారు.  అప్పులు పెరిగినా తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ వేసినా గొంగళి అక్కడి లాగానే ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అంటే ట్యాంక్ బండ్లు, రోడ్డు డివైడర్లు, స్ట్రీట్ లైట్లు తప్ప మరేమీ అభివృద్ధి లేదన్నారు.