- కాంగ్రెస్‌పై రాజకీయ దురుద్దేశంతో డ్రామాలు
- రుణమాఫీ చేతగానోళ్లు మామీద నిందలేస్తండ్రు
- టెక్నికల్ సమస్యతో మాఫీకాని వారిని రెచ్చగొడుతున్నరు
- బీఆర్ఎస్, బీజేపీ ట్రాప్‌లో పడొద్దంటూ రైతులకు సూచన
- రూ.2లక్షల వరకున్న లోన్లను తప్పకుండా మాఫీ చేస్తమని వెల్లడి
హుస్నాబాద్/ భీమదేవరపల్లి, వెలుగు : కేసీఆర్ ట్యూనింగ్, కిషన్‌రెడ్డి మ్యూజిక్‌తో కాంగ్రెస్‌పై రాజకీయ దురుద్దేశపు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రైతుల రుణాలు మాఫీ చేయడం చేతగానోళ్లు, వాళ్లపై వడ్డీల భారం మోపినోళ్లు తమ ప్రభుత్వం మీద నిందలేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్‌తో రుణమాఫీ కాని రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రుడిని దర్శించుకున్నారు. వీరభధ్రుడి ఆలయంలో జరిగిన రుద్రహోమంలో పాల్గొన్నారు.
తర్వాత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గత పదేండ్లలో బీఆర్ఎస్, బీజేపీ ప్రజలకు ఏం ఒరగబెట్టాయో అందరికీ తెలుసన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణాలను మాఫీ చేస్తే ఓర్వలేని ఆ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రైతులెవరూ వాళ్ల ట్రాపులో పడొద్దన్నారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్‌తో రుణమాఫీ కాని రైతులను బీఆర్ఎస్, బీజేపీ రెచ్చగొడుతూ రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ సమస్యలన్నీ పరిష్కరించి రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పారు. అన్ని మండల కేంద్రాల్లో ఫిర్యాదు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మండల వ్యవసాయాధికారులు ఆ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు.
రాజీవ్ విగ్రహాన్ని బరాబర్ పెడుతం
సెక్రటేరియట్ ముందు బరాబర్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తీరుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని, అలాంటి మహనీయుడి విగ్రహాన్ని కూల్చేస్తామన్న కేటీఆర్‌కు మతి భ్రమించిందన్నారు. “దేశంలో సాంకేతిక విప్లవాన్ని తెచ్చింది రాజీవ్. నువ్వు అమెరికాకు వెళ్లి చదువుకున్నావంటే అది ఆయన చలవే. నీ పార్టీ అధికారంలోకి వస్తదా? అసలు అది ఉందా? ఎప్పుడో చచ్చిపోయింది. కేటీఆర్ ఒళ్లు దగ్గరపెట్టొని మాట్లాడు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే ధైర్యం ఉందా?” అని సవాలు విసిరారు.
మహిళలకు ఫ్రీ బస్సు జర్నీపై ప్రతిపక్షాల కుట్రలు
2018 డిసెంబర్ 12 కంటే ముందు, 2023 డిసెంబర్ 9 తరువాత లోన్లు తీసుకున్న రైతులకు రుణమాఫీ కాదని ప్రభుత్వం ఇప్పటికే చెప్పిందన్నారు. అలాంటివారిని ముందుకేసి బీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలేస్తున్నాయని విమర్శించారు. ఆ పార్టీల డ్రామాలన్నీ రైతులకు తెలుసన్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ రూ.లక్ష రుణమాఫీ ఎన్ని విడతల్లో చేశారని, ఎంత మంది రైతులకు ఇచ్చారని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పాలన్నారు.
ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తుంటే మహిళలను అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్, కిషన్‌రెడ్డి చేస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆ ఇద్దరు కలిసినా పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లు దాటలేదని ఎద్దేవా చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 34,882 మంది రైతులకు రూ.269.6 కోట్ల రుణమాఫీ పూర్తయిందని పొన్నం చెప్పారు. నియోజకవర్గంలో 70 శాతం మంది రైతులు లోన్లు తీసుకున్నారని, ఇందులో 2018 డిసెంబర్ 12కు ముందు, 2023 డిసెంబర్ 9 తరువాత లోన్లు తీసుకున్నవారి రుణమాఫీ కాలేదన్నారు.