రైతులు ఏడుస్తుంటే ప్లీనరీలు పెట్టి సంబరాలా?

కరీంనగర్, వెలుగు: వడగండ్ల వానలతో నష్టపోయిన ఏ రైతును పలకరించినా బోరున ఏడుస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ లీడర్లు ప్లీనరీల పేరుతో సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వడగండ్ల వానలతో జిల్లావ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్,  కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి, మేనేని రోహిత్ రావు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలెక్టర్​కు మంగళవారం వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా రైతులకు పరిహారం త్వరగా అందేలా చూడాలని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి కలెక్టర్ కాళ్లు మొక్కారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..  రైతులు కన్నీరు పెడుతుంటే అధికార పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం తీరికలేకుండా తిరుగుతున్నారన్నారు. ఐకేపీ సెంటర్లు  టైంకు ప్రారంభించకపోవడంతో వర్షానికి వడ్లు తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు రూ.10 వేల పరిహారం అందిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,  రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చెర్ల పద్మ, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, రహమత్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.