కాంగ్రెస్‌ను ఎదగనీయకుండా టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని కరీంనగర్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎవరైనా చనిపోతే రావాల్సిన ఉప ఎన్నికలను అధికారం కోసం, అహంకారాలకు తెస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ పొన్నం ప్రభాకర్ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వేములవాడ దేవాలయానికి ఇస్తానన్న రూ. 100 కోట్లు ఇప్పటి వరకు ఇవ్వలేదని తెలిపారు. కరీంనగర్ ప్రజలకి బండి సంజయ్ దూరమయ్యారని, గ్రానైట్ పరిశ్రమలు, ఈడి కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు.
బండి సంజయ్, గంగుల కమలాకర్ లు కేసీఆర్ స్క్రిప్ట్ చదువుతున్నట్లు విమర్శించారు. బండి సంజయ్ గెలుపు కేవలం వాపు మాత్రమేనని తెలిపారు. ఎగువ మానేరు ఇప్పటికి పూర్తి కాలేకపోవడంతో ప్రజల నుండి నిరసన వ్యక్తం అవుతోందని వెల్లడించారు. మిడ్ మానేర్ ముంపు గ్రామాల సమస్య ఇప్పటికి తీరలేదన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను బతుకమ్మ చీరలకే పరిమితం అయ్యే విధంగా చేశారని విమర్శించారు. మోడీ అచ్చే దిన్ కన్నా అప్పటి రోజులే నయమని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి మీద నిరసన వ్యక్తమౌతోందని తెలిపారు. 57 సంవత్సరాలకే పెన్షన్ ఎక్కడా అని ప్రశ్నించారు.