
భీమదేవరపల్లి, వెలుగు : కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని ప్రజలే నిర్ణయించుకున్నారని హుస్నాబాద్ కాంగ్రెస్ క్యాండిడేట్ పొన్నం ప్రభాకర్ చెప్పారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గురువారం నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. వామపక్షాల మద్దతుతో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో బీఆర్‌ఎస్ ప్రజల నమ్మకం కోల్పోయిందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2024 డిసెంబర్ 9 నాటికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. గౌరవెల్లి నీళ్లు అందించకుంటే మరోసారి ఓటు అడగబోనని చెప్పారు. ముత్తారం ఉప సర్పంచ్ యుగేందర్, జనసేన మండల అధ్యక్షుడు నద్దునూరి జయకృష్ణ పొన్నం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో సీపీఐ సిద్దిపేట, హనుమకొండ జిల్లా కార్యదర్శులు పవన్, కర్రె భిక్షపతి, ఆదరి శ్రీనివాస్, జనార్దన్, కొయ్యడ సృజన్‌కుమార్ పాల్గొన్నారు.