హుస్నాబాద్​కు ఏం ఒరగబెట్టారో చెప్పాలె : పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్​కు ఏం ఒరగబెట్టారో చెప్పాలె : పొన్నం ప్రభాకర్​
  • క్యాంపు ఆఫీసులో పూజలు చేసి ఫైలుపై సంతకం  చేసిన మంత్రి

హుస్నాబాద్​, వెలుగు : ఐదేండ్లు ఎంపీగా ఉన్న బోయినపల్లి వినోద్​రావు హుస్నాబాద్​ నియోజకవర్గానికి ఏం ఒరగబెట్టారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్​ ఫైర్​ అయ్యారు. నెలరోజులైనా హుస్నాబాద్​లో ఒక్క శిలాఫలకం వేయలేదని వినోద్​తోపాటు మాజీ ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ తనపై విమర్శలు చేయడం వాళ్ల అవివేకానికి నిదర్శనమన్నారు. 

సోమవారం ఆయన హుస్నాబాద్​లోని క్యాంపు ఆఫీసులో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఫైలుపై సంతకం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కరీంనగర్​ ఎంపీగా ఉన్న వినోద్​రావు ఐదేండ్లలో హుస్నాబాద్​ నియోజకవర్గానికి ఒక్క పనీ చేయలేదన్నారు. అలాంటి వ్యక్తి తనపై విమర్శలు చేయడం వింతగా ఉందన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్ని పనులు చేశానో చెబుతానని, ఆయన ఏం పనులు చేశారో చెప్పాలన్నారు.  

నెలరోజులైనా పూర్తి కాని తమ పాలనపై విమర్శలు చేయడం వారి అసహనాన్ని తెలుపుతోందన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలకు కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలుచేశామన్నారు. తాము ఇచ్చిన  మాటకు కట్టుబడి ఉన్నామని, వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు.